డ‌బుల్ ఇళ్లు పూర్త‌యి మూడేళ్లు.. క‌లెక్ట‌ర్లు మారినా మార‌ని సీన్‌

by Javid Pasha |   ( Updated:2024-06-02 16:26:46.0  )
డ‌బుల్ ఇళ్లు పూర్త‌యి మూడేళ్లు.. క‌లెక్ట‌ర్లు మారినా మార‌ని సీన్‌
X

దిశ, మరిపెడ : నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. పంపకానికి నోచుకోవడం లేదు. ఎదురుచూపులతో ఉన్న నిరుపేదలకు డబుల్ పథకం అందని ద్రాక్షగా మిగిలి పోయింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఇళ్లు వాడుకునే వాళ్ళకు వాడుకున్నంత అన్న చందంగా తయారై, పిచ్చిమొక్కలతో, ముళ్ళ చెట్లకు నిల‌యంగామారుతున్నాయి. ఇళ్లకు వేసిన రంగులు పోయి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు శిధిలావస్థకు చేరుకున్నాయి. కళ్ళముందే ఉన్న నిర్మాణాలను చూస్తున్న లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం డబుల్‌ బెడ్ రూం ఇండ్లపై "దిశ దిన పత్రిక "లో ప్రత్యేక కథనం..

దరఖాస్తులు స్వీకరించారు.. లబ్ధిదారుల జాబితా పూర్తిచేశారు..

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో డోర్నక‌ల్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్యా నాయక్ చేతుల మీదుగా తేదీ 06-05-2017 సంవత్సరంలో 50 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగానే అప్పటి తాహసీల్దార్ డ‌బుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధి దారుల ఎంపిక‌ కోసం దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారులను జాబితా ప్రక్రియను పూర్తి చేశారు. కానీ ఇళ్లను లబ్దిదారులకు అప్పగించలేదు. అప్పటి జిల్లా కలెక్టర్ వీపి గౌతమ్ నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో క్రిమిటోరియా నర్సరీల పరిశీలనకు వచ్చి అర్హులైన లబ్దిదారులను గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఇళ్ల పంపిణీ చేయాలని ఇంచార్జీ తహశీల్దార్‌ని ఆదేశించారు. అయినా నేటికీ ఇళ్లు పంపిణీ చేయకపోవడంతో అందని ద్రాక్షగా తయారైందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముగ్గురు కలెక్టర్లు.. ముగ్గురు తహసీల్దార్లు..

జయపురం డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రసాబాసగా మారింది. కలెక్టర్ గౌతమ్ ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులు, పంపిణీ ప్రక్రియలో కాలయాపన చేస్తుండగా.. వీటి పంపిణీ ఇప్పుడు ఇంకాస్త కష్టతరంగా మారింది. అప్పటి నుండి ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు తహసిల్దార్లు మారారు. తేదీ 09-07-2021న తహసీల్దార్ మేకల ఇమ్మయిల్ కలెక్టర్ ఆదేశానుసారం లక్కీ లాటరీ ద్వారా 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాని గ్రామంలోని చోటా మోటా అధికార పార్టీ నాయకుల కుమ్ములాటల వలన ఇళ్ల పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తై మూడు సంవత్సరాలు గడిచినా, పంపకానికి నోచుకోక పోవడంతో బాధితులు ఎదురు చూస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా డబుల్ ఇండ్లు..

కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులు మద్యం సేవించడానికి అనుకూలంగా ఉన్నాయని, డబుల్ ఇళ్లలో తాగి పడేసిన మద్యం బాటిళ్ళు దర్శనమిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పత్తి బస్తాలు దాచుకోవడానికి గోదాములుగా ఉపయోస్తున్నారని, లబ్ధి దారులకు ఇవ్వడానికే అధికారులకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

Advertisement

Next Story