వైర్‌లెస్ జామర్లు, నెట్‌వర్క్ బూస్టర్ల విక్రయాలపై ఈ-కామర్స్ కంపెనీలకు హెచ్చరిక!

by GSrikanth |
వైర్‌లెస్ జామర్లు, నెట్‌వర్క్ బూస్టర్ల విక్రయాలపై ఈ-కామర్స్ కంపెనీలకు హెచ్చరిక!
X

న్యూఢిల్లీ: సాధారణ ప్రజలకు వైర్‌లెస్ జామర్లు, నెట్‌వర్క్ బూస్టర్లను విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు టెలికాం విభాగం(డీఓటీ) సోమవారం జీపీఎస్ బ్లాకర్, సిగ్నల్ జామింగ్, సెల్యూలార్ జామర్, వైర్‌లెస్ జామర్ల ఉత్పత్తులపై ప్రకటనలు చేయడం, విక్రయించడం వంటి చర్యలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఈ పరికరాలను విక్రయించరాదని స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తులైనా, సంస్థలైనా ఈ పరికరాలను కొనడం లేదా వాడటం చట్టరీత్యా నేరమని తెలిపింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్నవి తప్పించి, దేశంలో సిగ్నల్ జామింగ్ పరికరాలకు సంబంధించి ప్రచారం చేయడం, విక్రయించడం, డిస్ట్రిబ్యూట్, దిగుమతి చేయడం చట్టవిరుద్ధమని వివరించింది. లైసెన్స్ ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే వీటిని వినియోగించాలి. ఈ నిబంధనను ఉల్లంఘించి కొనుగోలు చేయడం, విక్రయించడం చేస్తే వైర్‌లెస్ టెలిగ్రఫీ చట్టం, ఇండియా టెలిగ్రాఫ్ చట్టం కింద నేరంగా పరిగణించనున్నట్టు హెచ్చరించింది. దీనికి సంబంధించి డీఓటీ ప్రభుత్వ శాఖలకు ప్రకటన కాపీని పంపించింది. గత కొన్నేళ్లుగా డీఓటీ ఈ హెచ్చరికలు చేస్తూనే, పలుచోట్ల అక్రమ విక్రయాలపై సోదాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, రక్షణ దళాలు, కేంద్ర పోలీసు సంస్థలు మాత్రమే జామర్‌లను కొనుగోలు చేయగలవు, ఉపయోగించగలవు.

Advertisement

Next Story

Most Viewed