దిశ ఎఫెక్ట్‌.. క్వారీలను స్వయంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

by S Gopi |
దిశ ఎఫెక్ట్‌.. క్వారీలను స్వయంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఇసుక క్వారీల్లోని అక్రమాలు ఒక్కోటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇసుక క్వారీల్లో జ‌రుగుతున్న అక్రమాల‌పై దిశ ప‌త్రిక ఇటీవ‌ల కొన్ని సాక్ష్యాధారాల‌తో స‌హా క‌థ‌నాల‌ను ప్రచురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదితమే. అక్రమాలు జ‌రుగుతున్న విష‌యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లడంతో వారూ స్పందించారు. శాఖ‌ప‌ర‌మైన ఆదేశాల‌తో క్వారీల్లో త‌వ్వకాలు, ర‌వాణాలో జ‌రుగుతున్న అక్రమాల‌పై ఉన్నతాధికారులు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల‌తో గురువారం ములుగు జిల్లాలోని ప‌లు క్వారీల్లో అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. మంగ‌పేట మండ‌లం రాజుపేట‌, వాడ‌గూడెంలో పట్టాదారు రైతుల పంట పొలాల్లోని ఇసుక క్వారీల‌ను జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ స్వయంగా సంద‌ర్శించారు.

తహశీల్దార్ మహ్మద్ సలీంతో కలిసి ఇసుక క్వారీ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్వారీ ప్రాంతాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అద‌న‌పు క‌లెక్టర్ సూచించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకే ఇసుక త‌వ్వకాలు చేప‌ట్టాల‌ని సూచించారు. టీఎస్ఎండీసీ అధికారులు క్వారీ వద్ద ఉండి త‌వ్వకాల‌ను ప‌ర్యవేక్షించాల‌ని సూచించారు. నిబంధ‌న‌ల ప్రకారం ఇసుక తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఖచ్చితమైన రికార్డుల‌ను నిర్వహించాల‌ని సూచించారు. లారీలలో ఓవర్ లోడ్ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అడిగి తెలుసుకున్నారు. పట్టా రైతులు సైతం క్వారీ జరిగే ప్రాంతంలో ఉండి సర్వే నెంబర్లు దాటి ఇసుక తీసుకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి మైనింగ్ రఘు బాబు, టీఎస్ఎండీసీ పీఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, శంకర్ రావు, జిల్లా కలక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, వీఆర్వోలు, క్వారీ యాజమాన్యం ఉన్నారు.


ఆలుబాకలో వేబ్రిడ్జీ సీజ్‌..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక వద్ద వే బ్రిడ్జిని గురువారం తూనికల, కొలతల ములుగు జిల్లా అధికారిణి శ్రీలత సీజ్ చేశారు. లారీల్లో అధికంగా ఇసుక త‌ర‌లిపోతున్న త‌క్కువ మొత్తమే కంప్యూట‌ర్ ర‌శీదు జారీ చేస్తూ నిర్వాహాకులు అక్రమాల‌కు పాల్పడుతున్నార‌నే ఫిర్యాదుల నేప‌థ్యంలో అధికారులు ఆక‌స్మికంగా వే బ్రిడ్జీపై దాడి చేశారు. గురువారం ఉద‌యం ఇసుక తరలిస్తున్న లారీలను తూకం వేయించారు. ఇసుక ఎంత ఉన్నా.. ఒకే ర‌క‌మైన బరువును వే బ్రిడ్జీ కాంటాలో న‌మోద‌య్యేలా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఇటీవ‌ల జారీ చేసిన ర‌శీదుల‌ను అధికారులు ప‌రిశీలించ‌గా త‌ప్పుడు ర‌శీదులు జారీ చేసిన‌ట్లు గుర్తించారు. అక్రమాల‌కు పాల్పడుతున్న వే బ్రిడ్జిని సీజ్ చేస్తున్నట్లుగా అధికారిణి శ్రీల‌త పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed