ఫ‌లించిన ఉద్యోగుల చొర‌వ‌.. రేప‌టి నుంచి స‌ర్వే ప్రారంభం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-08 15:51:06.0  )
ఫ‌లించిన ఉద్యోగుల చొర‌వ‌.. రేప‌టి నుంచి స‌ర్వే ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ క్రాప్ సర్వేను తెలంగాణ రాష్ట్రంలోనూ అమ‌లు చేసేందుకు ఏఈఓలు అంగీక‌రించారు. రేప‌టి నుంచే స‌ర్వే ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. స‌ర్వే అమలుపరిచే ప్రక్రియలో కలిగే ఇబ్బందులపై గత పది రోజుల నుండి స‌ర్వేను చేప‌ట్ట‌కుండా ఏఈఓలు నిరసన చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని తెలంగాణ వ్య‌వ‌సాయ అధికారుల జేఏసీ సంఘాల నాయ‌కులు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, నాయ‌కుడు కె.రామ‌కృష్ణ దృష్టికి తెచ్చారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి జేఏసీ నాయ‌కులు ప్ర‌త్యేక చొరవ చూపారు.

తెలంగాణ వ్య‌వ‌సాయ అధికారుల జేఏసీ సంఘాల నాయ‌కులతో ల‌చ్చిరెడ్డి, రామ‌కృష్ణ మంగ‌ళ‌వారం ముందుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం తెలంగాణ వ్య‌వ‌సాయ అధికారుల జేఏసీ సంఘాల నాయ‌కులను ల‌చ్చిరెడ్డి, రామ‌కృష్ణ తీసుకొని వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి మ‌రియు ఏపీసీ రఘునంద‌న్‌రావు దగ్గ‌ర‌కు తీసుకెళ్లారు. స‌ర్వేతో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను, ఏఈఓలు స‌ర్వే ప్ర‌క్రియ‌కు ఎందుకు దూరంగా ఉంటున్నార‌నే విష‌యాల‌ను ఈ సంద‌ర్భంగా ల‌చ్చిరెడ్డి వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రఘునంద‌న్‌రావుకు వివ‌రించారు.

దీంతో అన్ని అంశాల‌పై వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రఘునంద‌న్‌రావు సానుకూలంగా స్పందించారు. డిపార్ట్ మెంట్ పెద్దగా నేను వున్నాను. కావున మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్వే స్టార్ట్ చేయండి. సర్వే స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. నేను దగ్గరుండి మీ ప్రతి సమస్య పరిష్కరిస్తానంటూ ర‌ఘునంద‌న్‌రావు చెప్పారు. ఇదే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మ‌న్ లచ్చిరెడ్డి, నాయ‌కుడు రామకృష్ణతో ఏపీసీ ర‌ఘునంద‌న్‌రావు ఏఈఓల‌ సమస్యలన్నిటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నాయ‌కులు స‌మ‌క్షంలో వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రఘునంద‌న్‌రావు హామీ ఇవ్వ‌డంతో రేప‌టి నుంచి స‌ర్వేను చేప‌ట్టేందుకు తెలంగాణ వ్య‌వ‌సాయ అధికారుల జేఏసీ నాయ‌కులు అంగీక‌రించ‌డంతో స‌మస్య‌కు ప‌రిష్కారం ల‌భించింది. రేప‌టి నుంచి డిజిటల్ క్రాప్ సర్వేను చేప‌ట్టాల‌ని ఏఈఓల‌కు తెలంగాణ అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ వ్య‌వ‌సాయ అధికారుల జేఏసీ సంఘాల నాయ‌కులు తెలంగాణ అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ నేత‌లు వైద్య‌నాథం, శ‌శిధ‌ర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ విస్త‌రాణాధికారుల సంఘం నాయ‌కుడు వై.శ్రావ‌ణ్‌కుమార్‌, తెలంగాణ వ్య‌వ‌సాయ వ్య‌వ‌సాయ విస్త‌రాణాధికారుల సంఘం నాయ‌కుడు సురేష్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed