తగ్గిన శనగ దిగుబడులు.. ఆందోళనలో శనగ రైతులు

by Vinod kumar |
తగ్గిన శనగ దిగుబడులు.. ఆందోళనలో శనగ రైతులు
X

దిశ, శంకర్ పల్లి: ఆరుతడి పంటగా సాగు చేసే శనగ పంట ఆశించిన దిగుబడులు రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటడంతో అందుకనుగుణంగా రైతులు కందులు, శనగలు సాగు చేస్తుంటారు. కంది పంట వానాకాలం పంటగా సాగు చేయగా శనగ పంట యాసంగిలో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు మొక్కజొన్న కోత అనంతరం అదే పొలంలో శనగ పంటను సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వర్షాలు సక్రమంగా కురవకపోవడం తదితర కారణాలతో గత రెండు సంవత్సరాలుగా శనగ రైతు ఆశించిన దిగుబడి సాధించలేక పోతున్నారు.


శంకర్పల్లి మండలంలో గత సంవత్సరం 1800 ఎకరాలలో శనగ పంట సాగు చేయగా యాసంగిలో 1420 ఎకరాల్లో సాగు చేశారు. శనగకు ప్రత్యామ్నాయంగా రైతులు కుసుమ పంట సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. కుసుమ పంట గత సంవత్సరం 250 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం 710 ఎకరాల్లో సాగు చేశారు. శనగ పంట ఆశించిన దిగుబడి రాకపోవడంతో కుసుమ పంట సాగుపై శ్రద్ధ కనబరిచినట్లు స్పష్టమవుతోంది.

తగ్గిన శనగ పంట దిగుబడులు..

శనగ పంట ఎకరానికి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా నాలుగు కింటాలు మాత్రమే వస్తున్నట్లు పలు గ్రామాల రైతులు చెబుతున్నారు. అన్నీ అనుకూలించి వర్షాలు సక్రమంగా కురిసి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 9 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. దిగుబడులు తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని దీంతో శనగ కంటే కుసుమ సాగు మేలని చెబుతున్నారు.

శనగ దిగుబడులు తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకపాయె.. విట్టల్ రెడ్డి (రైతు), కొత్తగూడ


తనకున్న రెండెకరాల పొలంలో శనగ పంట సాగు చేశాను. రెండెకరాలలో 9 క్వింటాళ్ల శనగలు దిగుబడి వచ్చాయి. వర్షాలు సక్రమంగా కురవకపోవడం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సగానికి సగం దిగుబడులు తగ్గాయి. శనగ పంట ఎకరానికి ఎనిమిది కింటాలు రావాల్సి ఉంది. కానీ నాలుగు క్వింటాళ్ల మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకపాయె. పెట్టుబడులు ఎకరానికి 25 వేల వరకు వస్తాయి. రెండు ఎకరాలు సాగు చేయగా 50 వేల పెట్టుబడి ఖర్చయింది. రెండెకరాలలో తొమ్మిది క్వింటాళ్ల సెనగలు దిగుబడి రావడం తో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేవు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధర పెంచితే రైతులకు మేలు.. కిష్టయ్య (రైతు) అంతప్పగూడ


శంకర్పల్లి డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాలు రూ.5230 సరిపోవడం లేదు. మార్కెట్‌లో పప్పుల ధరతో పోలిస్తే శనగల కొనుగోలు ధర ఏ మాత్రం సరిపోవడం లేదు. కనీసం క్వింటాలుకు రూ.8 నుంచి రూ.10 వేలు నిర్ణయిస్తే రైతులకు కొంత అయినా లాభం ఉంటుంది. మన రాష్ట్రంలో దేశంలో పండించిన పంటలను ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్యా యుద్ధం తో నూనె ధరలు పెరుగుతాయని ప్రకటిస్తున్న ప్రభుత్వం మన వద్ద పండే పంటలను బయటి దేశాలకు ఎగుమతి చేస్తే మన రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలను ఎగుమతులకు అనుమతిస్తే ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed