ఒత్తిడిలో ఒంటరిగా మిగిలిపోతున్న నాన్న.. స్ట్రెస్‌కు కారణమిదే?

by Manoj |
ఒత్తిడిలో ఒంటరిగా మిగిలిపోతున్న నాన్న.. స్ట్రెస్‌కు కారణమిదే?
X

దిశ, ఫీచర్స్: మహిళ 'తల్లి'గా, పురుషుడు 'తండ్రి'గా మారి, ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్న క్షణంలో మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతుంటారు. కానీ, కొందరిలో మాత్రం ఆ ఆనందం కాసేపే ఉంటుంది. దీనికి కారణం 'ప్రసవానంతర ఒత్తిడి(PPD)'. పోస్ట్‌ పార్టమ్ అనేది పిల్లలు పుట్టిన వెంటనే సంభవించే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ కాగా ఇది సాధారణంగా మాతృమూర్తుల్లో నివేదించబడుతుంది కానీ తండ్రుల్లో కూడా సంభవించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పరిశోధన ప్రకారం ప్రసవానంతర డిప్రెషన్ కొత్తగా తండ్రి అయిన ప్రతీ పదిమందిలో ఒకరిని ప్రభావితం చేస్తుండగా.. బిడ్డ పుట్టిన 3 నుంచి 6 నెలల ముందు లేదా తర్వాత ఆందోళన ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి ఎలాంటి చికిత్స అవసరం, డిజార్డర్ లక్షణాలు ఏమిటి? తెలుసుకుందాం.

పెళ్లయి రెండేళ్లు దాటిపోయింది ఇంకా పిల్లల్లేరా అనే ప్రశ్న బయటి వ్యక్తుల కంటే ముందే ఇంట్లో పెద్దవాళ్ల నుంచి వ్యక్తమవుతుంది. తమ పదవీ విరమణ సమయంలో 'ఆడుకోవడానికి మనవడు/మనవరాలు' ఉండాలని ఆశ పడుతుంటారు. నిజమే కావచ్చు కానీ 'పిల్లల్ని కనడం' అనేది 'గ్రాండ్ పేరెంట్స్'‌కు ఆడుకునేందుకు ఇచ్చే గిఫ్ట్‌గానే పరిమితం కాదు. పిల్లల పుట్టుకతో తల్లిదండ్రులు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక, మరెన్నో అసంఖ్యాకమైన ప్రణాళికలు వేయాల్సి ఉంటుంది. నిత్యం తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి, నోరు తెరిచి అడగని ఆ పసిప్రాణానికి ఆహారం ఇవ్వాలి, వారి ఏడుపును అర్థం చేసుకోవాలి, మాటలు నేర్పించాలి, ప్రతీ చర్యను గమనించాలి. ఈ క్రమంలో తల్లితండ్రులకు వందల కొద్దీ నిద్రలేని రాత్రులుంటాయి. అందుకే పేరెంటింగ్ అనేది 'కేక్ వాక్' కాదు. ఒక పిల్లోడిని పెంచేందుకు ఇతరుల మద్దతు కావాలి కానీ బతుకు పోరులో, ఉద్యోగ వేటలో కుటుంబాన్ని వదలి పట్టణాల్లో జీవనం సాగిస్తున్న ఈతరం జంటలకు ఇదే పెద్ద సమస్య. ఇక్కడ వారి జీవితం చాలా తీవ్రమైనది ఉద్యోగ బాధ్యతలతో తలమునకలై ఉండే జంటలు సాధారణంగా కొత్త బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. దీంతో పిల్లలపై పూర్తిగా సమయం, శక్తిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. అనుభవజ్ఞులైన కుటుంబ సభ్యుల నుంచి బాధ్యత లేదా సలహాలను పంచుకోవడంలో వారికి మద్దతు లభించకపోతే మరింత చిక్కుల్లో పడతారు. ఇది కూడా 'ప్రసవానంతర ఒత్తిడి'కి ఓ కారణం.

మరిన్ని కారణాలు:

నవజాత శిశువు అవసరాలను తీర్చేక్రమంలో పురుషుల్లో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. పెరిగిన బాధ్యత మానసికంగా ప్రభావం చూపుతుంది. అంతేకాదు అప్పటివరకు తమ పార్టనర్ తనపై చూపించిన కేరింగ్, లవ్ ఆటోమేటిక్‌గా బిడ్డ మీదకు షిఫ్ట్ కావడం, శిశువుతోనే తల్లులు ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం, వారితో ఈజీగా కలిసిపోవడం వంటి విషయాలన్నీ పురుషులకు తమ మధ్య దూరం పెరిగిన భావనను కలిగిస్తాయి. అదేవిధంగా బేబీతో నాన్నలకు బంధమేర్పడేందుకు కొంత సమయం పట్టడం వల్ల వాళ్లు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇక కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో పాటు నిద్ర లేకపోవడం వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. ఇక భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిగారింట్లో బిడ్డను ప్రసవించడం ఆనవాయితీ. దీంతో కొత్తగా పుట్టిన బిడ్డకు దూరంగా ఉండటం తండ్రికి కష్టంగా అనిపించడం కూడా ఈ డిప్రెషన్‌కు ఓ కారణమే. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత తల్లుల హార్మోన్లు మారుతాయని అందరికీ తెలుసు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత తండ్రుల్లో కూడా హార్మోన్ స్థాయిల్లో మార్పులను అనుభవిస్తారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, 2017 పరిశోధన ప్రకారం పురుషులు తమ భాగస్వామి గర్భధారణ సమయంలో తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్‌ను అభివృద్ధి చేయవచ్చని సూచిస్తున్నారు. ఈ క్షీణత మానసిక కారణాల వల్ల కావచ్చు. పెరినాటల్, ప్రసవానంతర కాలంలో పురుషుల్లో మారే అదనపు హార్మోన్లలో ఈస్ట్రోజెన్, కార్టిసాల్, వాసోప్రెసిన్, ప్రోలాక్టిన్ ఉన్నాయి.

సాధారణ సంకేతాలు

* కోపం, చిరాకు లేదా ఉద్రేక భావన

* కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉండటం

* విచారంగా ఉండటం

* బరువు తగ్గడం లేదా పెరగడం

* నిరాశవాదం సహా అలసటను అనుభవించవచ్చు

* పనిలో సాధారణం కంటే ఎక్కువ సమయం గడపడం

* ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం

* మద్యం సేవించడం, జూదం మొదలైన వ్యసనాలకు అధిక సమయం కేటాయించడం

* డిప్రెషన్ చరిత్ర ఉన్న పురుషులు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది

కాగా ఇలాంటి లక్షణాలు.. 3 నుంచి 4 వారాల పాటు కొనసాగితే వైద్య సహాయం తీసుకోవాలి.

నిరోధించేందుకు ఏం చేయాలి?

ప్రసవానంతర మాంద్యం అనేది వైద్యులు సులభంగా, వివిధ మార్గాల్లో చికిత్స చేయగల సాధారణ పరిస్థితి. ఇందుకోసం మందులతో సహా టాక్ థెరపీ, మానసిక చికిత్స, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ఉత్తమమార్గాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన స్వీయ-సంరక్షణ అలవాట్లను నిర్వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, ఆరోగ్యకరమైన నిద్ర వంటివి పోస్ట్ పార్టమ్‌ను ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఈ డిప్రెషన్ విషయానికి వస్తే, భారతీయ సమాజంలో ఇలాంటి విషయాల గురించి పురుషులు మాట్లాడటం ఓ కళంకంగా చూస్తారు. అందువల్ల దాని గురించి మీరు సౌకర్యవంతంగా చర్చించే వ్యక్తితోనే డిస్కస్ చేయడం చాలా ముఖ్యం.

మగ PPD నిజమైనదని పరిశోధన ధృవీకరిస్తున్నప్పటికీ, మెజారిటీ పురుషులకు దాని గురించి తెలియదు. అంతేకాదు దురదృష్టవశాత్తు, చాలా మంది పురుషులు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి చెబితే నవ్వుతారు లేదా కొట్టిపారేస్తారు. వాళ్లు అంగీకరించనప్పటికీ, అది తమపై ప్రభావం చూపుతుందన్నది మాత్రం నిజం. అందువల్లే దీనిపై పురుషులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయినా ఇది అసాధరమైన జబ్బేం కాదు. పితృత్వం అనేది ఓ కొత్త, అదనపు ఉద్యోగం. కాకపోతే ఇక్కడ వేతనం ఉండదు. ఈ స్థితిలో ఉన్న పురుషులు సానుకూల మానసిక స్థితిని కొనసాగించేందుకు, సెల్ఫ్-సెక్యూర్ బేసిక్స్‌పై దృష్టి పెట్టాలి.

- డాక్టర్ బీ

Advertisement

Next Story

Most Viewed