Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగిచ్చేస్తాం.. అంబేద్కర్ జయంతి రోజున కోమటిరెడ్డి హామీ

by GSrikanth |   ( Updated:2022-04-14 14:16:28.0  )
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగిచ్చేస్తాం.. అంబేద్కర్ జయంతి రోజున కోమటిరెడ్డి హామీ
X

దిశ, నల్లగొండ: భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని చర్లపల్లి బైపాస్ వద్ద అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ప్రపంచ మేధావి అని అన్నారు. అట్టడుగు వర్గంలో పుట్టిన అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని అన్నారు. దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందడం సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు.

అభివృద్ధి పేరుతో గ్రామాల్లో ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నా ప్రభుత్వం తీసుకుంటోందని ధ్వజమెత్తారు. దీంతో పేదలు ఇంకా పేదవాళ్లుగానే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూములను కేటాయించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పేదల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటీ, వంగాల అనిల్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, బొజ్జ శంకర్, జూలకంటి శ్రీనివాస్, సమద్, గడియ శ్రీనివాస్, పేరిక వెంకటేశ్వర్లు, అల్లి సుభాష్ యాదవ్, బుర్రి యాదయ్య, నాగరాజు, శంకర్, గాదరి రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story