చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్.. జాతరలే వీరి టార్గెట్..

by Vinod kumar |
చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్.. జాతరలే వీరి టార్గెట్..
X

దిశ, జడ్చర్ల: జల్సాలకు అలవాటుపడి రద్దీ ప్రాంతాల్లో, జాతరలో చైన్ స్నాచింగ్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను సోమవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశ పెట్టి మహబూబ్ నగర్ డీఎస్పీ కిషన్ వివరాలు వెల్లడించారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరి ప్రాంతానికి చెందిన ముడవత్ పాండు, సేవ్య, శ్రీను‌ గతంలో వీరు పలు నేరాలకు పాల్పడి వివిధ పోలీసు స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో పాండుపై పిడి యాక్టు కేసు నమోదు అయి ఒక సంవత్సరం జైలు జీవితం అనుభవించాడని, ఇటీవలే నిందితుడు విడుదలై.. మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం జాతరలో బిజినపల్లి గ్రామాల్లో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.

ఇటీవల జడ్చర్ల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ ఎర్ర గుట్ట మండలంలోని ఆలూరు రోడ్డు గంగాపూర్ గ్రామంలోని ఇటీవల జరిగిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలలో చోరీలకు పాల్పడ్డారని ఇలా జడ్చర్ల మండలంలో వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయని, వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి సుమారు పదిన్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును ఛేదించిన జడ్చర్ల పోలీసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు రాజేందర్ నాయక్, మొహమ్మద్ ఖాదర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story