ఇన్‌స్పిరేషనల్ కిడ్స్.. సమాజంలో మార్పు కోసం ప్రయత్నం

by Manoj |
ఇన్‌స్పిరేషనల్ కిడ్స్.. సమాజంలో మార్పు కోసం ప్రయత్నం
X

దిశ, ఫీచర్స్ : సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే పిల్లలను ప్రోత్సహించే లక్ష్యంతో 'రీడ్రాయింగ్ ఇండియా' పేరుతో పాపులర్ కేబుల్ చానల్ 'కార్టూన్ నెట్‌వర్క్' ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా స్ఫూర్తిదాయకమైన పనులతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఆరుగురు చిన్నారుల కథలను వీడియో సిరీస్‌గా తీసుకొస్తుంది. ఈ విభిన్న కథనాలు మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా, మనం తలచుకుంటే ప్రపంచాన్ని ఎంత గొప్పగా పునర్మించవచ్చో(రీడ్రా) చాటి చెబుతున్నాయి. అంతేకాదు 'మీరు మీ ప్రపంచాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నారు' అంటూ దేశప్రజలను ప్రశ్నిస్తున్న ఆ పిల్లల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ప్రసిద్ధి సింగ్:

చెన్నయ్‌కి చెందిన ఏడేళ్ల ప్రసిద్ధి సింగ్.. సామాజిక సేవా రంగంలో కనబరిచిన ప్రతిభకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను ఇటీవలే అందుకుంది. నాలుగేళ్ల వయసు నుంచే మొక్కలు, ప్రకృతిపై ఎనలేని ప్రేమను పంచుకున్న చిన్నారి.. 'ఈచ్ వన్.. ప్లాంట్ వన్' అంటూ ప్రతీ ఒక్కరినీ 'ట్రీ ప్లాంటేషన్'లో భాగం కావాలని పిలుపునిస్తోంది. వర్దా తుఫాను సమయంలో చెన్నయ్‌‌లో వందలాది చెట్లు నేలమట్టం కావడంతో నాలుగేళ్ల ప్రసిద్ధి తీవ్రంగా ఆందోళన చెందింది. ఆ మరుసటి ఏడాది నుంచే భూమికి పచ్చని సిరులు అందించాలనే లక్ష్యంతో 'ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్'‌ను ప్రారంభించింది. అంతేకాదు నగరంలో క్షీణిస్తున్న పక్షుల జనాభాను పెంచేందుకు పాఠశాలల్లో మైక్రో ఫ్రూట్ ఫారెస్ట్‌లను పెంచడం సహా ఆ చెట్లకు సంరక్షకులుగా 'కిడ్స్ ఆర్మీ'ని సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటి వరకు 20 పండ్ల అడవులను సృష్టించిన ఆమె.. తద్వారా భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన 'ఫ్రూట్ ఫారెస్ట్' సృష్టికర్తగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. తన పనికి మెచ్చి దాదాపు 10వేలకు పైగా పర్యావరణ యోధులు ఆమె వెంటనడుస్తుండగా.. 2022 చివరి వరకు దేశంలో లక్షకు పైగా చెట్లను నాటాలనే లక్ష్యంతో ప్రయాణిస్తోంది.

హేమేష్ చదలవాడ:

అనేక మంది ఆవిష్కర్తలు మానవ సమాజ సంక్షేమానికి దోహదపడగా.. ఆ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన 15ఏళ్ల హేమేష్ చదలవాడ ఒకడు. తన అమ్మమ్మ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుండేది. ఇంద్రియాలపై నియంత్రణ లేకుండా రాత్రుళ్లు తిరుగుతుండటం చూసిన హేమేష్.. ఆమెకు ఉపయోగపడేలా ఓ పరికరాన్ని డెవలప్ చేయాలని ఆలోచించి, ఏ సమయంలోనైనా వ్యక్తిని ట్రాక్ చేయగల స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌ను కనిపెట్టాడు. ఇందులో హెల్త్ సెన్సార్స్, పల్స్ రేట్ సెన్సార్స్.. గైరోస్కోప్‌కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా సంరక్షకుని ఫోన్‌కు సిగ్నల్స్ పంపుతాయి. ఈ తర్వాత గుంతలను గుర్తించే పాథోల్ డిటెక్టర్, GPS ద్వారా సిగ్నల్స్ పంపే సెన్సరీ సాఫ్ట్‌వేర్, స్మార్ట్ సీట్ బెల్ట్, యాక్సిడెంట్ నోటిఫైయర్ వంటి అనేక ఇతర ప్రాజెక్ట్స్ పూర్తి చేశాడు. వికలాంగులు, వృద్ధులకు ఉపయోగకపడే గాడ్జెట్‌, యాప్‌లను కూడా అభివృద్ధి చేశాడు. ఈ కుర్రాడి ఆవిష్కరణలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం అతడి వెబ్‌సైట్ – hemesh.techలో అందుబాటులో ఉంది.

రిధిమా పాండే:

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్య ఉద్గారాల గురించి యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బెర్గ్ చేసిన ఆలోచింపజేసే ప్రసంగం గురించి ప్రపంచానికి తెలుసు. కానీ వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ చేసిన 16 మంది పిటిషనర్లలో 11 ఏళ్ల భారతీయ బాలిక కూడా ఉందని మాత్రం కొద్దిమందికి తెలుసే. ఆమె దేశంలోని అతి పిన్న వయస్కురాలైన పర్యావరణవేత్తలలో ఒకరైన రిధిమా పాండే. భారతదేశం అత్యంత హానికరంగా మారబోతోందని, ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తోందని వాదించింది. గంగా ప్రక్షాళన విషయంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని కూడా రిధిమా గొంతెత్తింది. పాలిథిన్ సంచులు, చెత్త, పారిశ్రామిక వ్యర్థాలతో సహా పెద్ద మొత్తంలో వ్యర్థాలు శుద్ధి చేయకుండా నదిలోకి విడుదలవుతున్నాయని, ఇందులో అధికారుల పూర్తి ఉదాసీనత ఉందని వివరించింది. 2020లో BBC అత్యంత ప్రభావితం చేసే 100 మంది మహిళల్లో ఒకరిగా పేరుపొందిన చిన్నారి.. TEDx స్పీకర్‌గా, CoP 26 యూత్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా వివిధ అంతర్జాతీయ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

శ్రవణ్ సేవ:

డార్జిలింగ్‌లోని పోఖ్రియాబాంగ్‌కు చెందిన శ్రవణ్ సేవ జీవితం కూడా స్ఫూర్తిదాయకమే. ఓ ప్రమాదంలో అతను దాదాపుగా తన స్వరాన్ని కోల్పోయాడు. అయితే అలుపెరగని కృషి, పట్టుదల, సంకల్పం కారణంగా ఈ రోజు బీట్‌బాక్సర్‌గా, సంగీత కళాకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

జాన్వీ జిందాల్:

ఫ్రీస్టైల్ రోలర్ స్కేటింగ్‌లో నేషనల్ చాంపియన్‌గా నిలిచిన 14 ఏళ్ల జాన్వీ తన భాంగ్రా ఆన్ వీల్స్ రొటీన్‌కు ప్రసిద్ధి చెందింది. 2020లో 'స్కేట్‌లపై భాంగ్రా ప్రదర్శించిన అతి పిన్న వయస్కురాలి'గా యువ స్కేటర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత స్కేటింగ్ చేస్తూ మెట్లపైకి గ్లైడింగ్ చేసినందుకుగానూ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.

బ్రిశాంత్ రాయ్:

కేవలం 4 సంవత్సరాల వయస్సులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను టీవీలో చూడటం ద్వారా ఆట గురించి తెలుసుకున్న బ్రిశాంత్ ప్రసిద్ధ ఆటగాళ్లను గమనించడం ద్వారా ఆటలోని మెళకువలను నేర్చుకున్నాడు. డార్జిలింగ్‌కు చెందిన బ్రిశాంత్ ప్రస్తుతం 13 ఏళ్ల వయసులో తన ఆటతీరుతో ప్రశంసలు పొందుతున్నాడు. సెల్ఫ్‌గా ఫుట్‌బాల్ నేర్చుకున్న ఈ కుర్రాడు.. ప్రస్తుతం తన పాఠశాల జట్టుకు కెప్టెన్ కాగా అతని గ్రామంలోని ప్రతి ఒక్క కుర్రాడికి ప్రేరణగా నిలిచాడు.

'ఇండియాను రీడ్రాయింగ్ చేయడం అనేది ఒక ఉత్ప్రేరకం, ఇది ప్రతి బిడ్డకు కూడా వారి ప్రపంచాన్ని తిరిగి గీయగల శక్తి ఉందని చూపిస్తుంది. భారతదేశం ప్రతిభతో నిండి ఉంది మరియు పిల్లలే దాని భవిష్యత్తు. ఈ వీడియో సిరీస్ భారతదేశపు పిల్లల్లో వారి ప్రత్యేక సామర్థ్యాలు, కలలను గుర్తించి.. వాటిని పెంపొందించుకోవడానికి అభిరుచిని రేకెత్తిస్తుందని మేము ఆశిస్తున్నాము. కార్టూన్ నెట్‌వర్క్, Instagram, Facebookలో, #RedrawYourWorld హ్యాష్‌ట్యాగ్ ద్వారా పిల్లల సృజనాత్మక చిత్రాలు, వీడియోలను భాగస్వామ్యం చేయమని తల్లిదండ్రులను కోరుతున్నాం. ఇది మా 'రీడ్రా యువర్ వరల్డ్' క్యాంపెయిన్‌లో భాగం. ఇది పిల్లలు తమను తాము అన్వేషించడానికి, వ్యక్తీకరించడానికి ప్రోత్సహిస్తుంది. గుర్తుంచుకోండి #YouGottaBeYou!

- అభిషేక్ దత్తా, సీఎన్ అండ్ పోగో సౌత్ ఏషియా నెట్‌వర్క్ హెడ్

Advertisement

Next Story

Most Viewed