టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కేస్తాం.. బీఎస్‌పీ సంచలన వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2022-03-18 16:59:32.0  )
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కేస్తాం.. బీఎస్‌పీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నాగారం: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గమైన పాలన నడుస్తోందని, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడానికి 300 రోజుల బహుజన రథయాత్ర చేపడుతున్నామని, టీఆర్ఎస్ పార్టీ పాలనను ఏనుగుతో తొక్కేస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బహుజన రథయాత్రలో భాగంగా 13వ రోజు శుక్రవారం తిరుమలగిరి మండలంలోని అనంతారం, తిరుమలగిరి వెలిశాల, తొండ, జానకిపురం నాగారం మండలంలోని ఫణిగిరి, ఈటురు, నాగారం, పసునూరు గ్రామాల్లో బహుజన రథయాత్ర రాత్రి 9 గంటల వరకు పర్యటించి గ్రామాల్లోని ప్రజలను కలిశారు.

బహుజన రథయాత్ర సభల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో 13 వందల మంది అమరవీరులు ప్రాణాలు అర్పించింది కేసీఆర్ దుర్మార్గ పాలన కోసమేనా అని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని, తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించి, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా, ప్రైవేట్ యూనివర్సిటీలకు, తమ అనుచర వర్గానికి ఇస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చారని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలేనా? మిగతా నియోజకవర్గాల అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని, ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి గ్రామాల్లో యువకులు ప్రయత్నిస్తే వారిపై గూండాలతో దాడులు చేయించి అక్రమ కేసులు, పీడీ యాక్ట్‌లు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని అన్నారు.

గ్రామాల్లో బెల్టు షాపులు ద్వారా మద్యం విక్రయిస్తూ ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్లు ఇచ్చామని టిఆర్ఎస్ పాలకులు గొప్పగా పండగ చేస్తే, అందులో 40 వేల కోట్ల రూపాయలు భూస్వాములకు దక్కాయని కేవలం 10 వేల కోట్లు మాత్రమే సన్నకారు రైతులకు అందాయన్నారు. రైతుబంధు భూస్వాములకు బంధువుగా మారిందని, దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దళితులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని, అసెంబ్లీలో ప్రకటించిన రెండు లక్షల 56 వేల కోట్ల బడ్జెట్లో బీసీల వాటా తేల్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం పై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.

ఫణిగిరి బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌ల ఆర్బాటాలు తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. దేశ, విదేశ బౌద్ధ భిక్షువులకు విహారస్థలంగా ఫణిగిరి గ్రామాన్ని పాలకులు అభివృద్ధి చేస్తే , గ్రామం మహా నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఉన్నత చదువులు చదివిన యువకులు తమ ఆత్మాభిమానం చంపుకుని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా, హమాలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, హోటల్లో సర్వత్రా పనిచేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికి రాబోయే ఎన్నికల్లో

బీఎస్పీ పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ప్రజలందరికీ ఇష్టంగా అందిస్తామని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తామని అన్నారు .ఈ రథయాత్ర కార్యక్రమంలో బి ఎస్ పి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి బల్గురి స్నేహ, సరిత, ఎర్ర రావణ్, బొజ్జ సైదులు, మచ్చ నరసయ్య, ఈదుల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed