టీఆర్ఎస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో?

by GSrikanth |   ( Updated:2022-04-05 00:00:58.0  )
టీఆర్ఎస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్​ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం చేయనుంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేసీఆర్​సర్కార్​వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు కాషాయదళం సిద్ధమవుతోంది. ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతు సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ధాన్యం కొనకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న తీరును రైతులకు అవగాహన కల్పించేందుకు బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ రైతు సదస్సులు బీజేపీ నిర్వహించనుంది. హైదరాబాద్​మినహా ఇతర తొమ్మిది జిల్లాల్లో సదస్సులు నిర్వహించిన నిజానిజాలను ప్రజలకు, రైతులకు తెలియజేసి టీఆర్ఎస్​తీరును ఎండగట్టాలని బీజేపీ శ్రేణులు కంకణం కట్టుకున్నాయి.

వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సులకు పార్టీ శ్రేణులే కాకుండా జిల్లాకు కనీసం వెయ్యి మంది రైతులను పోగు చేయాలని కమలనాథులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై గ్రామాలవారీగా రైతులకు సమాచారం అందజేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్​మిల్లర్లతో కుమ్మక్కయిందని బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, వారు చేస్తున్న ఆరోపణలను స్పష్టమైన ఆధారాలతో నిరూపించేందుకు కాషాయదళం సిద్ధమైంది. బాయిల్డ్​రైస్​ఉంటే మిల్లర్ల నుంచి దొడ్డి దారిన డబ్బులు దండుకోవచ్చని టీఆర్ఎస్​నేతలు ప్లాన్​వేస్తున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆ డబ్బులు ఎక్కడ తమకు రాకుండా పోతాయోనన్న ఒకే ఒక్క కారణంతో కేంద్రంపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి దొంగ నాటకాలు ఆడుతోందని ఫైరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలాగా వ్యవహరించి ఎఫ్‌సీఐకి ధాన్యం అందించాలని, దానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ అందజేస్తుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా సంతకం చేశారనే విషయాన్ని ప్రజలు, రైతులకు తెలియజేసి టీఆర్ఎస్​తీరును ఎండగడుతామని వారు స్పష్టం చేస్తున్నారు. బాయిల్డ్​రైస్‌ను నేడు ఎవరూ తినడంలేదని, అయినా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కిరికిరి పెడుతుందోనని మండిపడుతున్నారు.

ఈ సదస్సులను ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో నిర్వహించనున్నారు. మొదటిరోజు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్​జిల్లాల్లో నిర్వహించనున్నారు. వరంగల్​జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరై రైతులకు ధాన్యం కొనుగోళ్ల అంశంలో తప్పెవరిది అనే అంశంపై అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో నిర్వహించే సదస్సుకు సీనియర్​నేత మురళీధర్ రావు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా రెండో రోజు 8వ తేదీన సదస్సును ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో నిర్వహించే సదస్సుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి, బీజేపీ కిసాన్​మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొంటారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సదస్సులో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొంటారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సదస్సుకు సీనియర్​నేత జితేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్వహించే సదస్సుక పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొంటారు.

మూడోరోజు 9వ తేదీన ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్​జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించే సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పాల్గొననున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే సదస్సులో ప్రేమేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, కిసాన్​మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు సదస్సుకు హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొంటారు. రైతు సదస్సు వేదికగా వీరంతా కేసీఆర్​సర్కార్​తీరును ఎండగట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed