Vijaya Shanthi: కేసీఆర్ అసలు రంగు ఇదే.. విజయశాంతి సీరియస్

by GSrikanth |   ( Updated:2022-06-30 08:20:21.0  )
BJP Leader Vijaya Shanthi Criticizes CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: BJP Leader Vijaya Shanthi Criticizes CM KCR| బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీని అడ్డుకోవడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కిందా మీదా పడినా ఆయన ప్రతిపాదించిన బీఆర్ఎస్‌కి స్పందన రాదని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే 'ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి'.... అన్న సామెత గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అవిభక్త కవలలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంకు కాంగ్రెస్ కూడా తోడై మూడు పార్టీలు కలిసి సయామీ ట్రిప్లెట్స్ అవతారమెత్తాయని అన్నారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పరస్పరం విమర్శించుకున్న టీఆర్ఎస్, ఎంఐఎంలు ఆ తర్వాత ఎంత అన్యోన్యంగా మారిపోయాయో అందరికీ తెలుసని అన్నారు.

అసలు రంగు బయటపెట్టుకున్నారు:

కాంగ్రెస్‌తో పోరాటం చేస్తున్నానని పైకి బిల్డప్పులిస్తున్న కేసీఆర్.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో అసలు రంగు బయటపెట్టుకున్నారని విమర్శించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ యువరాజులు రాహుల్, కేటీఆర్ ఇద్దరూ కలసికట్టుగా ఉల్లాసంగా కనిపించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉందని, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చే విషయంలో వెంటనే ఏ నిర్ణయాన్ని చెప్పని కేసీఆర్.. బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగా వ్యవహరిస్తున్నట్లు నటించి చివరకు కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్ష కూటమిలోనే చేరిపోయారని అన్నారు. గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదేనని విమర్శించారు. కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ చేస్తున్న పనులన్నీ తప్పటడుగులే అని అన్నారు.

Advertisement

Next Story