- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలంలో యాత్రికుల స్వర్గధామంగా మాహారాష్ట్ర..
దిశ, ఫీచర్స్ : చినుకు తడికి పచ్చని మొలకలతో కొత్త శోభ సంతరించుకునే భూమి నయనాలకే కాదు మనసుకూ ఆహ్లాదాన్ని పంచుతుంది. ఏమాటకామాట.. వర్షాకాల అందాలను మాటల్లో వర్ణించే కంటే మనసారా ఆస్వాదించడంలోనే కిక్ ఉంటుందనేది ప్రకృతి ప్రేమికుల మాట. ఆకాశానికి గొడుగు పట్టే నల్లని మేఘాలు, పాలపొంగులా జాలువారే జలపాతాలు ఆసాంతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయంటే అతిశయోక్తి కాదు. అందుకే కాబోలో ముసురు పట్టుకున్న వేళ.. ఆ ప్రకృతి వన్నెల సంగతేంటో తేల్చుకునేందుకు ట్రెక్కింగ్ ప్రియులు తమ మూటాముల్లెతో సిద్ధమైపోతారు. వారికే కాదండోయ్.. కొత్త సాహసికులు ఎవరికైనా వానాకాలం సరైన వాతావరణాన్నే కల్పిస్తుంది. సుసంపన్నమైన వృక్షజాలం, సహజ సుందరమైన అందాలు తిలకించాలంటే ఈసారి వీకెండ్ ట్రిప్ మహారాష్ట్రకు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆ ప్రాంతంలోని ది బెస్ట్ ట్రెక్కింగ్ డెస్టినేషన్స్ వివరాలు మీకోసం..
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు సాహస యాత్రికుల స్వర్గధామమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్సాహభరితమైన హిల్ స్టేషన్లలో విహరిస్తూ, పచ్చని చెట్ల మధ్యనున్న చారిత్రాత్మక కోటలు, గుహల మీదుగా ప్రయాణిస్తుంటే వచ్చే మజా ఏ అంతరిక్ష యాత్రకు తక్కువ కాదంటే నమ్మండి.
లోహగడ్ ఫోర్ట్ ట్రెక్:
ట్రెక్కింగ్ ప్రారంభకులకు అనువైన ట్రెక్ 'లోహగడ్ ఫోర్ట్'. ఇది ముంబై, పుణెకు సమీపంలోని ఉత్తమ ట్రెక్కింగ్ డెస్టినేషన్స్‌లో ఒకటి. లోనావాలాకు దగ్గరలోని ఈ కోట సముద్ర మట్టానికి 1,033 మీటర్లు (3,389 అడుగుల)ఎత్తులో ఉంది. మరాఠీలో 'ఐరన్ ఫోర్ట్'గా పిలవబడే లోహగడ్.. మరాఠా రాజుల వ్యూహాత్మక వాణిజ్య మార్గంలో కీలక పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పర్వత శ్రేణి నుంచి జాలువారే పవన, ఇంద్రాయణి నదుల అందమైన దృశ్యం జీవితకాలం ఓ మధురజ్ఞాపకంగా నిలిచిపోతుంది. ముంబై నుంచి 100 కి.మీ దూరంలో లోహగడ్ ఉంటుంది. ఈ ట్రెక్ పూర్తి చేసేందుకు దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశముంది.
రాజ్‌మాచి ఫోర్ట్ ట్రెక్:
లోనావాలా, కర్జత్ అనే రెండు హిల్ స్టేషన్ల మధ్యనున్న రాజ్‌మాచి కోట.. మహారాష్ట్రలోని అత్యంత అందమైన చారిత్రక కోటల్లో ఒకటి. ఈ కోట సముద్ర మట్టానికి సుమారు 2750 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఫోర్ట్ ద్వారా ట్రెక్కర్లు.. 'శ్రీవర్ధన్(2510 అడుగులు), మనరంజన్ (2710 అడుగులు)' పేరు గల రెండు వేర్వేరు కోటలను అధిరోహించే అవకాశాన్ని పొందుతారు. హరితశోభతో విలసిల్లే పర్వతాలు, అందమైన జలపాతాలతో నిండిన లోయలతో చుట్టుముట్టిన ఈ కోట నలువైపులా విస్తరించిన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ఈ ప్రాంతం ముంబై నుంచి 125 కి.మీ దూరంలో ఉంటుంది.
రతన్‌గడ్ ఫోర్ట్ ట్రెక్:
మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లాలోని రతన్‌గడ్ కోట.. పశ్చిమ కనుమల్లోని అనేక 'హిల్‌ఫోర్ట్స్'లో ఒక సుందరమైన గడి. సముద్ర మట్టానికి 4233 అడుగుల ఎత్తులో కోట అజోబా పర్వత శ్రేణిలో ఉంది. దాని చుట్టూ కులాంగ్, అలంగ్, కల్సుబాయి, కటరాబాయి వంటి అనేక పర్వతాలు ఉన్నాయి. 400 ఏళ్ల నాటి ఈ కోట
సమీపంలోని పర్వతాలు, భండార్దారా ఆనకట్ట అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. రతన్‌గడ్ కోట ట్రెక్కింగ్‌కు అనేక మార్గాలుండగా, రతన్‌వాడి గ్రామం నుంచి వచ్చే మార్గం అత్యంత ప్రసిద్ధమైంది. అయితే ఈ ట్రెక్కింగ్ సమయంలో లోతైన అడవులను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం ముంబై నుంచి 197 కి.మీలో ఉంటుంది.
రాయ్‌గఢ్ ఫోర్ట్ ట్రెక్:
రాయ్‌గఢ్ జిల్లాలోని రాయ్‌గఢ్ కోట 1674లో మరాఠా యోధుడు శివాజీ మహరాజ్ పాలనలో రాజధానిగా ఉండేది. 2,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట లోపలి ప్రధాన నిర్మాణాలు చాలావరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఇది మరాఠా చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళ మనల్ని కట్టిపడేస్తుంది. ఈ ప్రాంతం ముంబై నుంచి 166 కి.మీ దూరంలో ఉంది.
హరిశ్చంద్రగఢ్ ట్రెక్:
అహ్మద్‌నగర్ జిల్లాలోని మరో పురాతన కోట హరిశ్చంద్రగఢ్. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సముద్ర మట్టానికి 4650 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ట్రెక్‌కు చేరాలంటే అనేక గుహలు, దేవాలయాలను దాటాల్సి ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలకు ఈ కోట ప్రత్యేకం కాగా ఆ అద్భుతమైన దృశ్యాలు మంచి అనుభూతినిస్తాయి. ఈ ట్రెక్కింగ్‌లో సప్త తీర్థ పుష్కరిణి ఆలయం, కేదారేశ్వర్ గుహ, కొంకణ్ కడ(కొండ), తారామతి శిఖరం కొన్ని ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం ముంబై నుంచి 140 కి.మీ దూరాన ఉంది.
కర్నాలా ఫోర్ట్ ట్రెక్:
కర్నాలా కోటను 'ఫన్నెల్ హిల్' అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉంది. కర్నాలా పక్షుల అభయారణ్యం లోపల ఉన్న ఈ కోట సముద్ర మట్టానికి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ పాయింట్. దీన్ని14వ శతాబ్దంలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు.
టోర్నా ఫోర్ట్ ట్రెక్:
పుణె జిల్లాలోని ఎత్తయిన కొండపై ఉన్న ఈ కోటను దాని భారీ పరిమాణం కారణంగా 'ప్రచండగఢ్' అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 4,603 అడుగుల ఎత్తున ఉంది. ఈ కోట 1646లో ఛత్రపతి శివాజీ మహరాజ్ స్వాధీనం చేసుకున్న మొదటి కోట కావడంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
కోరిగాడ్ ఫోర్ట్ ట్రెక్:
పుణె జిల్లాలోని కోరిగాడ్ కోట 1500ల కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3,049 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట తుంగ్, టికోనా కోటలతో పాటు ఆంబీ వ్యాలీ నగర అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. అనేక దట్టమైన అడవులు, జలపాతాల గుండా ప్రయాణించే ఈ ట్రెక్ ప్రకృతి ప్రేమికులకు నిజంగా ఆహ్లాదాన్ని పంచుతుంది. అంతేకాకుండా కోటలో మూడు దేవాలయాలు, రెండు సరస్సులు ఉండటం విశేషం.
గార్బెట్ పాయింట్ ట్రెక్:
ముంబై నగరానికి సమీపంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి. పశ్చిమ కనుమల సుందరమైన వీక్షణలను అందిస్తుంది. ఆసియాలోని ఏకైక ఆటోమొబైల్ రహిత హిల్ స్టేషన్ ఇదే కావడం విశేషం.
సాగర్‌గడ్ ఫోర్ట్ ట్రెక్
మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో ఉన్న ఈ కోటను 'ఖేదుర్గ్' అని కూడా పిలుస్తుంటారు. కోట ఎగువ నుంచి చూస్తే అరేబియా సముద్ర అద్భుత దృశ్యం మనసును హత్తుకుంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1,357 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటను 1660 A.Dలో ఆదిల్షా నుంచి శివాజీ మహరాజ్ గెలుచుకున్నాడు. ఈ ప్రదేశం సముద్రాన్ని ఇష్టపడే వారితో పాటు పర్వతాలను ఇష్టపడే వారికి కూడా ది బెస్ట్ ప్లేస్.