అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటి తవ్వకాలు..

by Vinod kumar |
అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటి తవ్వకాలు..
X

దిశ, పర్వతగిరి: పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రకృతి వనరులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు అవసరం లేదనట్లు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపక గ్రామ శివారులో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువ ప్రాంతంలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అయితే పట్టించుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఏమి తెలియనట్టు చూస్తున్నారు. అక్రమార్కులు జేసీబీలతో మొరం తవ్వకాలు చేపట్టి గ్రామాల్లోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల నుండి కాని అటవీ ప్రాంతాల నుంచి కాని, చెరువుల నుంచి మొరం తీయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి.

కానీ ఇక్కడ అవేమి లేవు. ప్రతి రోజు తెల్లవారి జామున 4 గంటల నుండి 9 గంటల వరకు మిట్ట మధ్యాహ్నం 1 గంటల వరకు మొరం తరలింపు చేస్తున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలను మోసం చేస్తూ, అక్రమ మొరం తవ్వకాలతో కాలువ బలం రోజురోజుకి తప్పడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. పర్వతగిరి మండలం కొంకపక గ్రామ శివారులో ఉన్న కెనాల్ కాలువ నుండి మొరం తవ్వకాలు అక్రమంగా తవ్వుతున్నారని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. పట్టించుకునే నాధుడే లేరు.

అయితే ప్రతి రోజు తెల్లవారు జామున పల్లెల్లో ఉన్న ట్రాక్టర్ యజమానులను పిలిచి గ్రామంలోకి మొరం తరలింపు చేసి ఒక ట్రాక్టర్ ట్రిపుకు 600 చొప్పున అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీ కాలువ పక్కన పెద్ద పెద్ద బొందలు చేసి మొరం తవ్వకాలు జరుపుతున్నారు. కెనాల్ కాల్వకు మొరం తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధం. కానీ ఇక్కడ అది జరగకపోవడంతో అక్రమార్కులుకు వరంగా మారింది. అమాయక ప్రజల అసహాయతను ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నమ్మించి అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం పై వెంటనే అధికారులు స్పందించి అక్రమ మొరం రవాణాను అరికట్టాలని ప్రజలు వాపోతున్నారు.

Advertisement

Next Story