రిలయన్స్, అమెజాన్ మధ్య ఐపీఎల్ పోటీ!

by Web Desk |
రిలయన్స్, అమెజాన్ మధ్య ఐపీఎల్ పోటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మధ్య ఐపీఎల్ పోటీ నెలకొంది. అయితే, ఇది క్రెకటర్ల మధ్య మ్యాచ్ లాంటిది కాదు, ఆ క్రికెట్‌ను ప్రసారం చేసేందుకు జరుగుతున్న పోటీ. రానున్న ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి ప్రసార హక్కుల కోసం సుమారు రూ. 40-50 వేల కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి.

ఇదివరకు 2018-2022 మధ్య ఐదేళ్లకు స్టార్ ఇండియా రూ. 16,347 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఇప్పుడు రానున్న ఐదేళ్లకు మరింత ఎక్కువ ధర పలకవచ్చని తెలుస్తోంది. ఈ కారణంగానే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి టెలికాస్ట్ రైట్స్ కోసం రెండు బడా కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నట్టు సమాచారం. కోట్లకు పైగా వ్యూస్ వచ్చే ఈ క్రికెట్ లీగ్‌ను ప్రసారం చేయడానికి రిలయన్స్, అమెజాన్, సోనీ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందంపై కోర్టుకెళ్లిన అమెజాన్, రిలయన్స్ సంస్థలు ఇప్పుడు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం మరోసారి పోటీ పడుతుండటం గమనార్హం. తన బ్రాడ్‌కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్18 కోసం రిలయన్స్‌కు ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులతో 1.6 బిలియన్ డాలర్ల నిధులు సేకరించడానికి చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్, దాని డిజిటల్ విస్తరణ కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు లభిస్తే విస్తరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని కంపెనీ భావిస్తోంది. మరోవైపు అమెజాన్ సైతం అమెజాన్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్ గెలవాలని చూస్తోంది. ఇప్పటికే అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించింది. అయితే, అమెజాన్‌కు విడిగా టీవీ ప్లాట్‌ఫామ్ లేదు. దీనికోసం మరొక సంస్థతో భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed