Blue Star AC: తక్కువ ధరలో బ్లూస్టార్ కొత్త స్ప్లిట్ ఏసీలు!

by Harish |   ( Updated:2022-04-05 10:14:36.0  )
Blue Star AC: తక్కువ ధరలో బ్లూస్టార్ కొత్త స్ప్లిట్ ఏసీలు!
X

చెన్నై: ప్రముఖ ఎయిర్ కండిషనర్ బ్రాండ్ బ్లూ స్టార్ సంస్థ సరసమైన ధరల్లో మెరుగైన చల్లదనాన్ని అందించే స్ప్లిట్ ఏసీలను మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో ఇన్వర్టర్, ఫిక్స్‌డ్ స్పీడ్, విండో ఏసీలకు సంబంధించి దాదాపు 50 మోడళ్లను తీసుకొచ్చింది. మాస్ ప్రీమియం బ్రాండ్‌గా బ్లూస్టార్ కంపెనీ దేశీయంగా ఏసీ పరిశ్రమలో మరింత వ్యూహాత్మకంగా కొనసాగేందుకు మొదటిసారి కొనుగోలు చేసేవారు, తక్కువ ధరలో కొనాలనుకునేవారు, ముఖ్యంగా టైర్ 3, టైర్ 4, టైర్ 5 మార్కెట్లలోని వర్గాల వారి కోసం 2020లో మొదటిసారిగా స్ప్లిట్ ఏసీలను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ కంపెనీ ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకోవడం ద్వారా వినియోగదారులకు సరసమైన ధరల్లో ఉత్పత్తులను అందిస్తోందని కంపెనీ వివరించింది.

కొత్తగా విడుదల చేసిన ఏసీల్లో 3-స్టార్, 4-స్టార్, 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ మోడళ్లు ఉన్నాయి. ఇవి రూ. 30,990 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. దక్షిణ భారత్‌లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి 3-స్టార్ ఏసీలలో కూడా అధిక చల్లదనాన్ని ఇచ్చే హెవీ డ్యూట్ ఉత్పత్తులను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్.. 2011లో కంపెనీ రెసిడెన్షియల్ ఏసీల విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కంపెనీ మెరుగైన ఉత్పత్తులు, సరసమైన ధరల్లో వినియోగదారుల ద్వారా ఆదరణను పొందింది.

2022 నాటికి కంపెనీ భారత ఏసీ పరిశ్రమలో 14 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. రెసిడెన్షియల్ మార్కెట్లో వినియోగదారులకు అవసరమైన స్థాయిలో ధరలతో పాటు మెరుగైన ఏసీ మోడళ్లను తీసుకొచ్చాం. కేంద్రం తీసుకొచ్చిన పీఎల్ఐ పథకం ద్వారా కంపెనీ శ్రీసిటీలో కొత్తగా ప్రపంచ స్థాయి తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story