హోళీ సరదా స్నానం.. ఒకరు మృతి

by Vinod kumar |
హోళీ సరదా స్నానం.. ఒకరు మృతి
X

దిశ, ఎడపల్లి: ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామ శివారు ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆర్చ్ వద్ద గల నిజామ్ సాగర్ ప్రధాన కాలువలో శుక్రవారం నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బోధన్ మండలం పెంటాకలాన్ గ్రామానికి చెందిన గోనె సుధాకర్(23) యువకుడు, సుమారు 14 మంది యువకులు హోలీ సంబరాల్లో పాల్గొన్న అనంతరం సరదాగా స్నానం చేసేందుకు బైక్ లపై జానకంపెట్ గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాం సాగర్ కెనాల్ లోకి దిగారు.


స్నానాల అనంతరం అందరూ స్నేహితులు ఒడ్డుకు చేరుకున్న క్రమంలో తమ స్నేహితుడు కనబడక పోవడం తో బెంబేలెత్తారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన పోలీసులు కాలువలో నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేసి, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.


మృతదేహం లభ్యం కావడం తో శవపంచనామ నిర్వహించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండే రావు, ఏఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story