సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ

by Shyam |
సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో సంభవించిన వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు విరాళాలు అందుతున్నాయి. కేసీఆర్ పిలుపునకు తొలుత స్పందించిన తమిళనాడు సర్కారు తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌‌కు రూ. 10 కోట్లను, దుస్తులను విరాళంగా ప్రకటించగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.15 కోట్లను, పశ్చిమబెంగాల్ సీఎం రూ.2 కోట్లను ప్రకటించారు. మరోవైపున నగరంలోనే ఉంటున్న సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా భారీ స్థాయిలోనే విరాళాలు ప్రకటిస్తున్నారు. ఒక్క రోజులోనే సుమారు రూ. 37 కోట్లకు పైగా విరాళాల రూపంలో అందాయి. వ్యాపార, వాణిజ్యవేత్తల నుంచి కూడా విరాళాలు అందుతున్నాయి.

కేసీఆర్ పిలుపునకు ముందే..

సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వకముందే హీరో నందమూరి బాలకృష్ణ కోటిన్నర రూపాయలను ప్రకటించారు. సీఎం పిలుపు ఇచ్చిన తర్వాత మంగళవారం నిమిషాల వ్యవధిలోనే పలువురు టాలీవుడ్ హీరోలు విరాళాలను ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. యాధృచ్ఛికమో, ముందుగానే అనుకున్న సమయమోగానీ మధ్యాహ్నం 1.00 నుంచి 1.57 గంటల మధ్యలో ఐదుగురు యాక్టర్లు విరాళం ప్రకటించారు. సరిగ్గా 1.45 గంటలకు జూనియర్ ఎన్టీఆర్, అదే సమయానికి విజయ్ దేవరకొండ ప్రకటించారు. 1.57 గంటలకు చిరంజీవి, మహేశ్‌బాబు ప్రకటించారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ ట్విట్టర్ సందేశాలు, లేఖలు రాశారు. ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులతో స్వయంగా టెలిఫోన్‌లో మాట్లాడారు. చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుల విరాళాలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పారు. కొద్దిమంది సామాన్యులు కూడా వారికి చేతనైన సాయం చేయడానికి ముందుకొచ్చారు. తమ శక్తి మేరకు వేల రూపాయల్లో మాత్రమే సాయం చేయగలమంటూ కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

విరాళాలు ప్రకటించినవారు..

మెగా ఇంజినీరింగ్ – రూ. 10 కోట్లు
మై హోమ్ రామేశ్వరరావు – రూ. 5 కోట్లు
బాలకృష్ణ – రూ. 1.50 కోట్లు
చిరంజీవి – రూ. 1.00 కోటి
పవన్ కళ్యాణ్ – రూ.1.00 కోటి
మహేశ్‌బాబు – రూ. 1.00 కోటి
ప్రభాస్ – రూ.1.00 కోటి
నాగార్జున – రూ. 50 లక్షలు
జూనియర్ ఎన్టీఆర్ – రూ. 50 లక్షలు
రామ్ – రూ. 25 లక్షలు
రవితేజ – రూ. 10 లక్షలు
విజయ్ దేవరకొండ – రూ. 10 లక్షలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ – రూ. 10 లక్షలు
హారిక-హాసిని క్రియేషన్స్ – రూ. 5 లక్షలు
హరీశ్ శంకర్ – రూ. 5 లక్షలు
బండ్ల గణేశ్ – రూ. 5 లక్షలు
అనిల్ రావిపూడి – రూ. 5 లక్షలు

Advertisement

Next Story