తుని తెలుగుదేశం కోటలో బీటలు..!

by srinivas |   ( Updated:2022-12-26 11:07:41.0  )
తుని తెలుగుదేశం కోటలో బీటలు..!
X
  • యనమల కుటుంబంలోనే రెండు వర్గాలు
  • యనమల దివ్యకు టికెట్ ఖరారు చేసిన అధిష్టానం
  • రామకృష్ణుడు కుమార్తెకు టికెట్ ఖరారు అధిష్టానంపై కృష్ణుడు గుర్రు
  • కృష్ణుడికే టికెట్ ఇవ్వాలంటున్న ఆయన వర్గం
  • రచ్చకెక్కిన యనమల సోదరుల మధ్య విభేదాలు
  • తొండంగి నాయకులతో కృష్ణుడి ఫోన్ సంభాషణ లీక్
  • నేను లేకపోతే తునిలో టీడీపీ లేదని చెప్పాలంటున్న కృష్ణుడు
  • కృష్ణుడు ఫోన్ సంభాషణ లీక్‌తో మరోసారి వేడెక్కిన రాజకీయం

దిశ, తుని: 2019 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్న తరుణంలో ఎన్నికలలకు సంవత్సరం పైబడి సమయం ఉండగానే ఆ పార్టీలో సీట్ల లొల్లి మొదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని అసెంబ్లీ టీడీపీ‌కి కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 వరకు యనమల రామకృష్ణుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ‌లో నెంబర్ టూ‌గా చెలామణి అయిన యనమల రామకృష్ణుడు ముప్పై ఏళ్ళు ఏకఛత్రాధిపతిగా ఏలారనే చెప్పుకోవాలి. అయితే తెర వెనక ఉండి ఆరుసార్లు అన్నని గెలిపించిన కృష్ణుడు నియోజకవర్గ స్థాయికే పరిమితమయ్యారు. 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడుపై అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ బాబు విజయం సాధించారు. దీంతో యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడుని బరిలో దింపారు. రెండుసార్లు ఓటమి చవి చూసిన కృష్ణుడు 2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఇటీవలే యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కృష్ణుడు ఈసారి టికెట్ కష్టం అనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఓ వర్గం కార్యకర్తలు కృష్ణుడికే టికెట్ ఇవ్వాలంటూ నినదించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల రామకృష్ణుడు అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ప్రకటించారు. అధిష్టానం ఎవరో కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తాదని భావించిన తమ్ముళ్లు సైలెంట్‌గా ఉండిపోయారు. ఆ సమావేశానికి ముందే "దిశ" తుని బరిలో యనమల దివ్య అనే వార్తను ప్రచురించింది. ఆ వార్తను గమనించిన తమ్ముళ్లు తమ నాయకుడికి కాకుండా కుమార్తెకి టికెట్ ఇప్పించేందుకు యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. తునిలో యనమల కృష్ణుడు లేకపోతే టీడీపీకి ఉనికి ఉండదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

యనమల కృష్ణుడు కోరిక కలేనా..!

యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడుకి ఒక కోరిక ఉందంట. తన జీవిత కాలంలో ఒకసారైనా అధ్యక్షా అని అనిపించుకోవాలని కోరికుందట. దాదాపు 40 ఏళ్ల కిందట రాజకీయం ప్రారంభించిన ఆయన ప్రస్థానంలో ఆయన పొందాల్సిన ప్రతీ అవకాశాన్ని యనమల రామకృష్ణుడే అనుభవించాడని చెప్పుకోవాలి. 1982లో స్వతంత్ర అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని యనమల కృష్ణుడు భావించారట. అయితే 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న యనమల రామకృష్ణుడుకి రాజకీయాలపై అంత ఆసక్తి ఉండేది కాదట. అప్పుడు తెలుగుదేశం పార్టీలో విద్యావంతులకే టిక్కెట్లు ఇస్తామని ఎన్టీఆర్ ప్రకటించడంతో యనమల రామకృష్ణుడిని కృష్ణుడే బలవంతంగా ఒప్పించారట. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా రామకృష్ణుడికి ప్రాధాన్యత ఇచ్చి అన్నీ తానై గెలిపించారట కృష్ణుడు. ప్రస్తుతం యనమల రామకృష్ణుడు మాత్రం టికెట్ తనకి కాకుండా తన కుమార్తెకి తెచ్చుకోవాలని చూస్తున్నారని కృష్ణుడికి తెలిసిపోయిందట. మరి యనమల కృష్ణుడు టికెట్ టీడీపీలో ఉంటారా లేక తన కోరిక తీర్చుకోవడానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి.

ఫోన్ సంభాషణలో కృష్ణుడు వ్యాఖ్యలు..

తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తుని టీడీపీ సీటు కూతురుకి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన యనమల రామకృష్ణుడిపై తమ్ముడు కృష్ణుడు సీరియస్ అవుతున్నాడు. ప్రస్తుత టీడీపీ ఇంచార్జి యనమల కృష్ణుడు, తొండంగి టీడీపీ నేత మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో యనమల కృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. యాదవ సంఘంలో 30 వేల ఓట్లు ఉన్నాయని, తాను లేకపోతే ఆ ఓట్లు ఎవరు చూడరని అన్నారు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది. యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు. తన కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి చాలని కృష్ణుడు అన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారని యనమల రామకృష్ణుడుకి చెప్పాలంటూ ఆ నేతతో కృష్ణుడు సంభాషించారు. కృష్ణుడు కష్టపడితే కూతురుకి సీటు ఇస్తారా అని ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండంటూ మాట్లాడారు. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమల రామకృష్ణుడుకి గట్టిగా చెప్పాలని ఆ నేతకి సూచించారు.

Read more:

Chirala మాజీ ఎమ్మెల్యే ఆమంచికి అగ్నిపరీక్ష!

Advertisement

Next Story

Most Viewed