తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Shyam |
ata
X

దిశ, అంబర్ పేట్ : తెలుగు వారు విదేశాలలోను ప్రతిభను చాటుతున్నారని, ప్రత్యేకంగా అమెరికాలో అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగ ప్రముఖులకు సత్కార కార్యక్రమంతో పాటు ‘ఆట’ సేవా కార్యక్రమాలు ముగింపు వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం పురోగమిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోవిడ్ టీకా ఉత్పత్తి చేయడం గర్వకారణం అన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రాజకీయాలకు అతీతంగా స్వరాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమెరికాలో స్థాపించిన తెలుగు సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అమెరికాలోని తెలంగాణ వారితో ప్రారంభమైందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఐటీ నిపుణులను అందిస్తున్న దేశం, భారతదేశమేనని వివరించారు. శరత్ వేముల స్వాగతం పలికిన సభలో శాసనసభ సభ్యుడు రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నాయకుడు చిన్నా రెడ్డి, నటుడు సుమన్, భానుచంద్రర్ , ఆటా కార్యవర్గం భువనేశ్, అనిల్, మధు బొమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ గాయని శోభా రాజ్ కు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు కవి యాకూబ్, నాట్య గురువు సత్యనారాయణ, సామాజిక కార్యకర్త పద్మ, వేణుగోపాల రెడ్డి, సుధా రెడ్డి మధుమా రెడ్డి, ఎల్లా రెడ్డిలను సత్కరించారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed