ఆ ఇద్దరు ఎవరు? రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల్లో టెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-28 03:31:49.0  )
ఆ ఇద్దరు ఎవరు? రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల్లో టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ స్ట్రాటజీ మీటింగ్‌లో అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వార్నింగ్ రాష్ట్రకాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమైంది. గీత దాటితే వేటు తప్పదని, ముగ్గురిని గుర్తించామని, ఇద్దరిపై చర్యలు తప్పవంటూ స్పష్టం చేయడం హాట్ టాపిక్‌‌గా మారింది. నేతల వివరాలన్నీ తన దగ్గరున్నాయని, ఎవరేం చేస్తున్నారో అంతా తనకు తెలుసని సీరియస్‌గా చెప్పడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.

రాహుల్ ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారనేది ప్రచారంలో ఉంది. అసంతృప్తి, భిన్నాభిప్రాయాలు ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, లేదా ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించి పరిష్కరించుకోవాలని, లేదా తన దృష్టికి తీసుకురావొచ్చని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియాకు, ఇతర వేదికలపై బహిర్గతం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

గతంలో పలువురు కామెంట్లు

రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు నేతలు ఓపెన్‌గానే కామెంట్లు చేశారు. గాంధీ భవన్ గడప తొక్కనంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు బై పోల్‌లో సోదరుడు రాజగోపాల్‌‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడినట్లుగా ఆడియో వైరల్ అయింది. దీనిపై అధిష్టానం నుంచి నోటీసు రావడం, దానికి రిప్లయ్ ఇవ్వడం జరిగిపోయాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో విభేదిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఒక టీవీ ఛానెల్ యాజమాన్యాన్ని నిందించారు. సీనియర్లంతా ఒక టీమ్‌గా ఏర్పడి రేవంత్‌రెడ్డి లీడర్‌షిప్‌తో విభేదించారు.

వివరాలు సేకరించిన ఏఐసీసీ

ఎవరు ఏ వేదిక మీద లీడర్లకు, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారో ఏఐసీసీ వివరాలను సేకరించింది. కొన్ని ఆధారాలను కూడా రెడీ చేసుకున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టిన హై కమాండ్.. నేతల మధ్య బేధాభిప్రాయాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని భావిస్తున్నది. అధికారంలోకి రావడానికి ఆటంకంగా ఉండేలా పరిణమిస్తే అలాంటి నేతలపై కఠిన చర్యలు తప్పవనేది తాజాగా రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. ముగ్గురిని గుర్తించినట్లు రాహుల్‌గాంధీ చెప్పినా వారి పేర్లను వెల్లడించకపోవడంతో ఎవరిపైన ఆయన దృష్టి పడిందనేది ఉత్కంఠకు దారితీసింది.

Also Read: లీడర్ కోసం.. తాండూరు కాంగ్రెస్‌లో ఎదురుచూపులు

Advertisement

Next Story