ఆ 75 మంది లిస్టును కేంద్రమంత్రికి పంపిన కేటీఆర్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్

by GSrikanth |   ( Updated:2023-10-12 11:54:12.0  )
ఆ 75 మంది లిస్టును కేంద్రమంత్రికి పంపిన కేటీఆర్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. నాలుగు కోట్ల ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీ గారిని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. అందుకే సెప్టెంబర్ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని హామీ ఇచ్చారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. మీరు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన భిక్ష.. సోనియమ్మ దయ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్‌లపై నిఘా పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేశారట.. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారు. కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారు. బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో.. నీ అధికారం 45 రోజులే.... ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి.. బీఆర్ఎస్ కార్యకర్తల్లా కాదు. కాంగ్రెస్ కార్యకర్తలారా 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే.. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయం.. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోడీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారు. నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు.. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం.. మీరు సిద్ధంగా ఉన్నారా? అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed