- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR : ఆ స్కీమ్ ఔట్ డేటెడ్ అనే అభిప్రాయానికి వచ్చిన గులాబీ బాస్!
దిశ, తెలంగాణ బ్యూరో: గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఆ హామీ గురించి ప్రస్తావించలేదు. ఐదేండ్లయినా ఆ హామీని నెరవేర్చకపోవడంతో దానిపై నిరుద్యోగులూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇచ్చిన హామీని అమలు చేయలేదనే అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. తాజా మేనిఫెస్టోలో ఆ అంశం లేకపోవడంతో ఇక అది ముగిసిన అధ్యాయమేనని, కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులు, యూత్, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే అంచనా, ఎలాగూ ఓట్లు పడవనే అభిప్రాయంతోనే నిరుద్యోగ భృతి గురించి తాజా మేనిఫెస్టోలో ప్రస్తావించలేదనే చర్చ జరుగుతున్నది. తాజా మేనిఫెస్టోను పరిశీలించిన యువత నిరుద్యోగ భృతి ఇక ఔట్ డేటెడ్ స్కీమ్ అనే అభిప్రాయానికి వచ్చారు.
40 లక్షల యూత్ ఓట్లు..?
రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ ఓటర్లు దాదాపు 8 లక్షలకు పైగా ఉన్నారు. యూత్ ఓటు బ్యాంకు దాదాపుగా 40 లక్షల మేర ఉండొచ్చని అంచనా. ఉద్యోగులూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయంతో ఇటీవల పీఆర్సీ ఏర్పాటు, 5% ఐఆర్ లాంటి ప్రకటనలు చేసిందని, యూత్ విషయంలో మాత్రం స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నందునే ఎలాంటి హామీలు ఇవ్వలేదనే చర్చ సాగుతోంది. గతేడాది మార్చి నెలలో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల కొలువులపై ప్రకటన చేశారు. టీఎస్ పీఎస్సీ ద్వారా పాతికకు పైగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ప్రశ్నా పత్రాల లీకేజీ, కొన్ని పరీక్షల రద్దు, మరికొన్ని పరీక్షలు వాయిదా.. ఇలాంటి అంశాలతోనే ఏడాదిన్నర గడిచిపోయింది. టీచర్ కొలువుల భర్తీ విషయంలో డీఎస్సీ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఇవన్నీ నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి.
వారి ఓట్లు ఎటు పడతాయో?
ఉద్యమకారులు సైతం అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నందునే మేనిఫెస్టోలో ఎలాంటి ఊసెత్తకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా మేనిఫెస్టోలో ప్రకటించిన పది హామీలూ మహిళలు, వృద్ధులు, రైతుల కేంద్రంగానే ఉన్నాయి. మిడిల్ క్లాస్‌ను ఆకట్టుకోడానికి లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి కొత్త హామీలు గుప్పించినా యూత్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రామిస్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్‌లో యువ వికాసం పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది. యూత్‌ను నిర్లక్ష్యం చేసిందనే భావనతో రానున్న రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఓటు బ్యాంకు కన్వర్ట్ అయ్యేది కాంగ్రెస్ కా లేక బీజేపీకా అనేది సస్పెన్స్ గా మారింది.
ఆ వర్గాల్లో వ్యతిరేకత..?
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులే దాదాపు 28 లక్షల మంది ఉన్నారు. అయితే బీఆర్ఎస్ యూత్ విషయంలో మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. జాబ్ నోటిఫికేషన్లపైనా, నిరుద్యోగ సమస్య పరిష్కారంపైనా ఎలాంటి ప్రస్తావన చేయకపోవడాన్ని నిరుద్యోగులు, యూత్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఉస్మానియా విద్యార్థి జేఏసీతో పాటు పలు విద్యార్థి సంఘాలు కూడా బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరితో ఆ పార్టీని ఓడించడానికి ప్రచారం చేయడానికి ఇటీవల ప్రోగ్రాం రూపొందించుకున్నాయి.