బిత్తిరి సత్తిపై భయంకరమైన ట్రోల్స్.. అసలేం చేశాడో తెలుసా?

by GSrikanth |
బిత్తిరి సత్తిపై భయంకరమైన ట్రోల్స్.. అసలేం చేశాడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల జోరు కనిపిస్తోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం రక్తికడుతోంది. పార్టీల నిర్ణయాలు, ఆలోచనలపై పరస్పరం విమర్శలపదును పెరుగుతున్న తరుణంలో యాంకర్ బిత్తిరి సత్తి (రవి కుమార్) పై బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ కు దిగడం హాట్ టాపిక్ గా మారుతుంది. బిత్తిరి సత్తి కుల పిచ్చోడు అంటూ గులాబీ పార్టీ మద్దతుదారులు మీడియాలో కామెంట్స్ చేయడం చర్చనీయాశం అవుతోంది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ముదిరాజు ఆత్మగౌరవ సభలో బిత్తిరి సత్తి స్పీచ్ పై బీఆర్ఎస్ నేతలు, అభిమానులు విమర్శలు గుప్పిస్తుంటే వారికి కౌంటర్ గా ముదిరాజులు, బిత్తిరి సత్తి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ బిత్తిరిసత్తి అన్నట్లుగా వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

బిత్తిరి సత్తి స్పీచ్ ఏమన్నారంటే:

సికింద్రాబాద్ సభలో బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను బిత్తిరి సత్తి యాక్టర్ గా మాట్లాడా.. ఇప్పుడు ఇక్కడ ముదిరాజు రవికుమార్ గా మాట్లాడుతున్నా.. ముదిరాజులకు రాజకీయ సోపతి లేదు. ముదిరాజులకు దురదృష్టవశాత్తు టికెట్లు ఇవ్వలేకపోయామని అయినా వారిని నామినేటెడ్ పోస్టులతో కడుపులో పెట్టుకుని చూస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారు. నామినేటెడ్ పోస్టులు సప్పగా ఉంటాయి. పోటీ పడే అవకాశం కల్పించండి. ముదిరాజులం 60 లక్షల జనాభా ఉన్నాం. 115 సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజులకు ఇవ్వలేదెందుకు? ముదిరాజుల కోసం ఏం పాలసీ తీసుకువచ్చారు?. ఇన్నాళ్లు ప్రభుత్వాలు ముదిరాజులకు చేసిందేమి లేదని ప్రభుత్వాల తీరుతో తామంతా బాధపడుతున్నామన్నారు. 20 ఏళ్ల తర్వాత మరోసారి ముదిరాజుల ఆత్మగౌరవ సభ పెట్టుకున్నామని మనకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మరో 20 ఏళ్ల తర్వాత మరోసారి ఆత్మగౌరవ సభ పెట్టుకుందామా? అని ముదిరాజులను అడిగారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగాయి. గతంలో కేసీఆర్ పాలనను పొగుడుతూ ఇదే బిత్తిరి సత్తి పాటలు పాడారంటూ పాత పాటలను షేర్ చేస్తున్నారు. తీరా ఫేమస్ అవ్వగానే కులం కార్డు పెట్టుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆయన మాటల్లో తప్పేముంది?

బిత్తిరి సత్తిపై జరుగుతున్న ట్రోలింగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు, ముదిరాజులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఆయన ప్రశ్నించిన దాంట్లో తప్పేముందని నిలదీస్తున్నారు. కులం పిచ్చి ఉండి ఫేమస్ అవడం కాదు టాలెంట్ తో ఫేమస్ అయ్యాడని, 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మీకు మద్దతు పలికితే మంచివారు లేదంటే కులపిచ్చోళ్లు అవుతారా అని మండిపడుతున్నారు. అసలే ముదిరాజుల టికెట్ల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బిత్తిరి సత్తిపై ట్రోల్స్ మరో తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story