కులాలుగా కాదు బీసీ సమాజంగా తిరగబడతాం.. రేవంత్‌పై మంత్రులు సీరియస్

by GSrikanth |   ( Updated:2023-07-19 14:40:54.0  )
కులాలుగా కాదు బీసీ సమాజంగా తిరగబడతాం.. రేవంత్‌పై మంత్రులు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని బీఆర్ఎస్ మంత్రులు హెచ్చరించారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. హైదరాబాద్‌లోని ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బుధవారం బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు భేటీ అయ్యారు. బీసీ నేతలు, ప్రజాప్రతినిధులపై రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. అనంతరం మీడియాతో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్ వేల కోట్లతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపడుతుందన్నారు. బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ‘మాకు అన్యాయం జరిగితే కులాలుగా కాదు బీసీ సమాజంగా ప్రశ్నిస్తాం, తిరగబడతాం’ అని హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, నాయకులు దాసోజు శ్రవణ్, తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story