‘కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గుంటనక్కలా మారారు’

by GSrikanth |   ( Updated:2023-11-14 09:45:15.0  )
‘కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గుంటనక్కలా మారారు’
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పని చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకునే పార్టీలని విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను బిచ్చం ఎత్తుకునే తెలంగాణగా మార్చారని మరోసారి అవకాశం ఇస్తే చిప్పకూడా మిగలకుండా పోతుందన్నారు. కర్నాటకలో ఫ్రీ పవర్ అని చెబితే నో పవర్ స్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. మేము మోసపోయామని కర్నాటక రైతులు తెలంగాణకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.


పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని పదవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను తుంగలోకి తొక్కిందని దుయ్యబట్టారు. బీసీ సీఎం చేస్తామని బీజేపీ అంటే కాంగ్రెస్ కనీసం మాట వరుసకైనా బీసీలను సీఎం చేస్తామని చెప్పడం లేదని విమర్శించారు. కాపలా కుక్కలా ఉంటానని గుంటనక్కలా మారారని సెటైర్ వేశారు. ఇవాళ రేవంత్, ఓవైసీ ఇద్దరు ఒకరు కొట్టినట్లు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్ లో పడుకునే నాయకుడు కావాలా ప్రజల కోసం పని చేసే మోడీ లాంటి నాయకుడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేనన్నారు. బీజేపీ మేనిఫెస్టో కూర్పు పూర్తయిందని 17 లేదా 18వ తేదీన ప్రకటిస్తామన్నారు. తమ మేనిఫెస్టో ప్రజల అభివృద్ధి కేంద్రంగా రూపొందించామని చెప్పారు.

Read More: భావోద్వేగాలకు పదును.. ప్రధాన పార్టీల స్ట్రాటజీ చేంజ్!

Advertisement

Next Story