YS షర్మిల సంచలన నిర్ణయం.. వ్యూహాత్మకమా?

by GSrikanth |
YS షర్మిల సంచలన నిర్ణయం.. వ్యూహాత్మకమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యవహారం రోజు రోజుకూ హాట్ టాపిక్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్సార్ టీపీ పార్టీని విలీనం చేయాలని భావించిన షర్మిలకు కాంగ్రెస్ వైపు నుంచి ఆశించిన రీతిలో సమాధానం దక్కలేదు. దీంతో ఇక ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పాలేరు, మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. విలీనం ప్రక్రియ విషయంలో ప్రస్తుతం ఇరు పార్టీలు స్తబ్దుగా మారాయి. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగనాలు వ్యక్తం అవుతున్న వేళ వైఎస్సార్ టీపీ చీఫ్ రెండు స్థానాల్లో పోటీకి సై అంటుండటం వ్యూహాత్మకమా లేక ఓటమి నుంచి తప్పించుకునే మార్గమా అనేది ఆసక్తిగా మారింది.

రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం:

రేపు వైఎస్ షర్మిల అధ్యక్షతన వైఎస్సార్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ మీటింగ్‌లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, పార్టీ పొత్తులపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా షర్మిల ప్రజాక్షేత్రంలో యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ట్విట్టర్‌లో అడపదడపా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా కేడర్‌కు కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. ఎన్నికల వేళ షర్మిల తీరుపై వైఎస్సార్ టీపీ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. దీంతో సైలెంట్‌గా తమ ప్రత్యామ్నాయం చూసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో విలీనం ప్రయత్నాలు కలిసిరాకపోవడంతో ఇక ఒంటరిగానే ముందుకు సాగాలనే నిర్ణయానికి షర్మిల వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను పోటీ చేయాలని భావించిన పాలేరు విషయంలో షర్మిల మొదటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడ తుమ్మల, పొంగులేటి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒక వేళ షర్మిల ఒంటరిగానే బరిలోకి దిగితే తుమ్మల, పొంగులేటిని ఢీ కొట్టగలరా అనే చర్చ జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా ఆమె రెండు స్థానాల్లో పోటీకి దిగాలనే ఆలోచన ఆసక్తికరంగా మారింది. మిర్యాలగూడ సెగ్మెంట్ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఉండగా కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. దీంతో ఈ స్థానాన్ని ఎంచుకోవడం వెనుక షర్మిల వ్యూహం ఏంటనేది ఆసక్తి రేపుతున్నది.

రెంటికీ చెడ్డ రేవడిల:

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పొలిటికల్ జర్నీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆమె విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. షర్మిల పార్టీ వల్ల ఎవరికీ నష్టం మరెవరికి లాభం అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఇంతలో ఆమె పాదయాత్ర మొదలు పెట్టడం ఆ తర్వాత బీఆర్ఎస్ తో తీవ్ర వివాదాల నేపథ్యంలో ఆమె గ్రాఫ్ పడిపోయిందనే టాక్ వినిపించింది. దీంతో ఇక గత్యంతరం లేకనే కాంగ్రెస్ వైపు చూశారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా షర్మిల రాకపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు షర్మిల రాకను స్వాగతిస్తే మరి కొందరు నిరాసక్తి ప్రదర్శించారు. ఈ క్రమంలో షర్మిల ఏకంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీతో భేటీ అయి విలీనంపై చర్చలు జరిపారు. దీంతో షర్మిల వైఖరి నచ్చక ఆమె వెన్నంటి నడిచిన ఏపూరి సోమన్న లాంటి ముఖ్య నేతలు వైఎస్సార్ టీపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం లేక అటు పార్టీలో డ్యామేజ్ తో రెంటికీ చెడ్డ రేవడిలో షర్మిల పరిస్థితి తయారైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో షర్మిల డిసిషన్ పై ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story