ప్రధాని మోడీ ఒక్కసారిగా స్వరం మార్చడం వెనక మర్మమేంటి?

by GSrikanth |
ప్రధాని మోడీ ఒక్కసారిగా స్వరం మార్చడం వెనక మర్మమేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ ఒక్కసారిగా స్వరం మార్చడం వెనక మర్మమేంటి?.. నాలుగేళ్లుగా చెప్పని అంత:పుర రహస్యాలను ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అనే ఆరోపణలను కొట్టివేయడానికేనా? ఈ రెండు పార్టీల మధ్య బంధం లేదని, కేసీఆర్ పాలనకు తాను వ్యతిరేకమని ప్రజలను నమ్మించడానికేనా? బండి తొలగింపు ద్వారా ఇప్పటికే జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసుకుని, పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్‌ను తగ్గించడానికేనా? ఎన్నికల్లో పొలిటికల్ మైలేజ్ పొందడానికేనా? ఇవీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో జోరుగా జరుగుతున్న చర్చలు.

ఫస్ట్ టైమ్ కేసీఆర్‌ టార్గెట్‌గా..

నిజామాబాద్‌లో మంగళవారం బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ చేసిన కామెంట్లు స్టేట్ వైడ్‌గా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకూ కుటుంబ పార్టీ, అవినీతి పాలన అంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన ప్రధాని.. ఫస్ట్ టైమ్ కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీశాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే భావన నెలకొన్న పరిస్థితుల్లో మోడీ కామెంట్స్‌తో ఒక్కసారిగా ప్రజల దృష్టి ఇటువైపు మళ్లింది. సరిగ్గా ఇలాంటిదే జరగాలన్న కాన్సెప్ట్‌తోనే ప్రధాని ప్లాన్ ప్రకారమే వ్యవహరించారు. బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ కామెంట్స్ మంటలు కొన్ని రోజుల పాటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కంటిన్యూ కానున్నాయి.

ప్రజల్లో విస్తృతంగా ‘బీ-టీమ్’ అంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పతనం స్టార్ట్ అయ్యింది. ఇదే టైంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అప్పటి నుంచి బీజేపీకి.. బీఆర్ఎస్ బీ-టీమ్ అనే విమర్శ ప్రజల్లో విస్తృతంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం స్టేట్ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని అధ్యక్షునిగా నియమించింది. ఈ పరిణామాలు రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలను కొనసాగించడానికే అనే టాక్ ప్రజల్లో పెద్ద ఎత్తున ఇప్పటికీ జరుగుతున్నది.

మోడీ ఫైర్ అవుతున్నది ఇందుకేనా?

ఎవరూ ఊహించని విధంగా ప్రధాని మోడీ.. కేసీఆర్‌పై ఇలా డైరెక్ట్‌గా విమర్శలు చేయడం అన్ని రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మోడీ ఈ కామెంట్స్ చేశారన్న దానిపై ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రజల మధ్య చర్చకు దారితీస్తున్న అంశాలివే..

= రాష్ట్రంలో చతికిలపడ్డ బీజేపీని మళ్లీ చర్చల్లోకి తేవడం.

= బీ-టీమ్ ఆరోపణలతో ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని నివారించుకోవడం.

= అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటే సంగతి ఎలా ఉన్నా కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదన్న వాదన నుంచి పార్టీని గట్టెక్కించడం.

= రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తీరులోని పొలిటికల్ సీన్‌ను మెరుగుపర్చడం.

= పార్టీ నుంచి చేజారిపోతున్న సీనియర్ లీడర్లను నిలుపుకోవడం. బీఆర్ఎస్‌తో ఫైట్ చేస్తున్నామని వారిలో కాన్ఫిడెన్సు కలిగించడం.

= అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోరును త్రిముఖ పోరుగా మార్చడం.

= తద్వారా జరిగే ఓట్ల చీలికతో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడం.

సీనియర్లు చేజారకుండా ప్లాన్

బీఆర్ఎస్‌తో ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నదనే అసంతృప్తితో పలువురు నేతలు బీజేపీని విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీలు వివేక్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, రమేష్ రాథోడ్ వంటి నేతలు డైరెక్ట్‌గా పార్టీ అగ్రనాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నదని, కవిత అరెస్టు, కేసీఆర్ అవినీతిపై చర్యలేవంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని పాల్గొన్న రెండు సభలకూ ఈ నేతలు దూరంగానే ఉన్నారు.

ఇంతకాలం మౌనమెందుకో?

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మేయర్ పోస్టుపై ప్రతిపాదనలు చేయడం మొదలు కేటీఆర్‌ను సీఎం చేయడం వరకు కేసీఆర్ జరిపిన సంప్రదింపులన్నింటినీ మోడీ తన తాజా ప్రసంగంలో ఏకరువు పెట్టారు. అవినీతి గురించీ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 డిసెంబర్‌లో జరిగితే ఇప్పటివరకూ కేసీఆర్ అవినీతి వ్యవహారంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?.. ఢిల్లీలో పలుమార్లు జరిగిన భేటీల్లో చర్చకు వచ్చిన ఈ అంశాలు ఇంతకాలం ఎందుకు బహిర్గతం చేయలేదు?.. ఇప్పుడే ఎందుకు బైట పెట్టాల్సి వచ్చింది?.. ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగిన చర్చల వివరాలు ఇప్పుడు వెల్లడించడం ద్వారా ఎలాంటి పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్నారు?

కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేయడంపైనా ఫోకస్

బీఆర్ఎస్, బీజేపీల్లో దేనికి ఓటు వేసినా ఒకటేననే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లలో కొందరు కొంత కాలం క్రితం బీజేపీవైపు మొగ్గుచూపారు. కానీ బీ-టీమ్ ఆరోపణలు రావడంతో కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించారు. దీన్ని పసిగట్టిన మోడీ.. సొంత పార్టీకి జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్‌ను దెబ్బతీయడంపై ఫోకస్ పెట్టారు. బీ-టీమ్ బంధం నిజం కాదని రూఢీ చేయడానికి కేసీఆర్‌పై విమర్శల మార్గాన్ని ఎంచుకున్నారు. మూడేండ్ల మౌనం తర్వాత సరిగ్గా ఇప్పుడు ఎన్నికల సమయంలో బయట పెట్టడంతో మోడీ మాటలను ప్రజలు విశ్వసిస్తారా?.. బీఆర్ఎస్‌ను ప్రత్యర్థిగా భావిస్తున్నామని నమ్మించే ఆయన చేసే ప్రయత్నం వర్కవుట్ అవుతుందా?.. ఆ రెండు పార్టీ పార్టీలు ఆశిస్తున్నట్లు వాటికి ఉమ్మడిగా ఉన్న కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అవుతుందా?.. మోడీ ఎన్నికల జిమ్మిక్‌ ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది?.. ఇవీ ఇప్పుడు ప్రజల్లో ప్రధానంగా సాగుతున్న చర్చలు.

Advertisement

Next Story