‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ’.. అనే పాట ఎవని పాలైందో! ఏపూరి సోమన్న ట్రోల్స్

by GSrikanth |
‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ’.. అనే పాట ఎవని పాలైందో! ఏపూరి సోమన్న ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫోక్ సింగర్ ఏపూరి సోమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జానపద గేయాలు వినే వారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఆయన సుపరిచితమే. షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత సోమన్న ఆ పార్టీలో చేరారు. ఇంతకాలం ఆమె వెంటే నడిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన ఆటాపాటలతో సమావేశాలను విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో సోమన్న ఉత్సాహాన్ని చూసిన షర్మిల పార్టీ తొలి అభ్యర్థిగా సోమన్నను తుంగతుర్తి సభలో ప్రకటించింది. అయితే, ఇటీవల షర్మిల కాంగ్రెస్‌లో చేరడానికి మంతనాలు జరుపుతుండటంతో ఒక్కొక్కరుగా పార్టీ శ్రేణులు షర్మిలను వీడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపూరి సోమన్న కూడా షర్మిలకు అనూహ్య షాకిచ్చారు. బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


ఇందులో భాగంగానే ఇవాళ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. కేటీఆర్ సైతం సోమన్న చేరికపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఇంతకాలం బీఆర్ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి వ్యరేతికంగా పాటలు పాడిన సోమన్న చివరకు గులాబీ పార్టీలో చేరడానికి సిద్ధం కావడంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ.. అనే పాట ఎవని పాలైందో’’ అని వాట్సాప్ గ్రూపుల్లో సోమన్నపై మండిపడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం పాటను వాడుకున్నావంటూ సోమన్నపై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సోమన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed