అప్పటివరకు కాంగ్రెస్ సెకండ్ లిస్టు విడుదల కాదు.. క్లారిటీ!

by GSrikanth |
అప్పటివరకు కాంగ్రెస్ సెకండ్ లిస్టు విడుదల కాదు.. క్లారిటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల మరింత ఆలస్యం కానుంది. తొలి జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించినప్పటికీ ఇంకా 64 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. ఈ నెల 25న మరోసారి భేటీ అయిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే మీడియాకు వివరించారు. ఈ లోపు అవసరమైతే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగే అవకాశమున్నట్లు తెలిపారు. తదుపరి ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఈ నెల 25న జరిగేలా ప్రాథమికంగా నిర్ణయం జరిగిందని, అభ్యర్థులను ఆ సమావేశంలోనే ఫైనల్ చేయనున్నట్లు తెలిపారు. అది జరిగేంతవరకూ సెకండ్ లిస్టు విడుదల కాదని క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు

పార్టీలో మరింత మంది చేరనున్నారని, సీపీఎం కోరుతున్న స్థానాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని మీడియాకు ఆయన వివరించారు. బీఆర్ఎస్ పార్టీ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇంకా ఖరారు చేయాల్సిన స్థానాలు 64 ఉన్నాయని, వాటిపై ఈ నెల 25 తర్వాత నిర్ణయం జరుగుతుందన్నారు. పార్టీలో అసంతృప్తి గురించి మాట్లాడుతూ.. తొలి జాబితా తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో మీరే చూశారు (పాత్రికేయులను ఉద్దేశించి) గదా అని ఎదురు ప్రశ్నించారు. అసంతృప్తి లేకుండా చూడడానికి పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నదని, సీనియర్ నేత జానారెడ్డి దాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

25న ఎలక్షన్ కమిటీ మీటింగ్

ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎలక్షన్ కమిటీలో అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చించామని, కానీ మరోసారి స్క్రీనింగ్ కమిటీలో డిస్కస్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలను ఈ నెల 25న జరిగే ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో చర్చిస్తామన్నారు. స్క్రీనింగ్ కమిటీ నివేదికను స్టడీ చేస్తామన్నారు. ఒకే సీటు కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నందున అన్ని కోణాల నుంచి ఆలోచించి విజయం సాధించే లక్ష్యంతో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నదన్నారు. సీపీఎం సీట్ల సర్దుబాటుతో పాటు సీపీఐ కోరుతున్న సీట్లపై ప్రాథమికంగా కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చినా మరోసారి వాటితో చర్చించాల్సి ఉన్నదని, మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

విజయంపై విశ్వాసం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పర్యటన మరోసారి ఉంటుందని, ఆహ్వానించేందుకు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పార్టీలో రెబల్స్ గురించి ప్రస్తావిస్తూ అలాంటి అవకాశం లేదన్నారు. పార్టీ పట్ల నమ్మకం ఉన్నందునే, అధికారంలోకి వస్తుందనే ధీమా ఏర్పడినందునే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరాలనుకుంటున్నారని తెలిపారు. వలసలతో సొంత పార్టీ నేతల మధ్య వచ్చే తేడాల విషయాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.

Advertisement

Next Story