ఎన్నికల వేళ రాష్ట్ర సర్కారు మరో కొత్త పథకం.. ప్రధాని ఫొటో చిన్నగా, కేసీఆర్ ఫొటో పెద్దగా?

by GSrikanth |
ఎన్నికల వేళ రాష్ట్ర సర్కారు మరో కొత్త పథకం.. ప్రధాని ఫొటో చిన్నగా, కేసీఆర్ ఫొటో పెద్దగా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రధాలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కలయికతో కొత్తగా స్మార్ట్ కార్డుల తరహాలో కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు కార్డును విడుదల చేసి, అనంతరం ప్రజాప్రతినిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి పొలిటికల్ మైలేజ్ పొందేందుకు ఆలోచిస్తున్నట్టు టాక్.

కేసీఆర్ బొమ్మతో..

రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కార్డులను తీసుకురాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు, వైట్ రేషన్ కార్డుల ద్వారానే పలు వైద్య సేవలు అందజేస్తున్నది. ఎన్నికల సమీపిస్తుండటంతో కొత్తగా స్మార్ట్ కార్డు తరహాలో కార్డులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటి వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులపై ఉన్న రాజీవ్ గాంధీ బొమ్మ, ఆయన పేరు తొలగిపోనున్నది. కొత్తగా జారీ చేసే కార్డులపై సీఎం కేసీఆర్ బొమ్మను ముద్రించాలని సర్కారు భావిస్తున్నది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కలయికతో ఈ కార్డులు రానున్నందున విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రగతిభవన్ నుంచి అధికారులను ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. అందులో ప్రధాని మోడీ ఫొటోను సైతం చిన్నదిగా పెట్టాలని ఆఫీసర్లకు సూచనలు అందినట్టు తెలిసింది.

90 లక్షల కుటుంబాలకు లబ్ధి?

ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు ఉన్న అందరూ ఈ పథకానికి అర్హులుగా ఉండటంతో వీరందరికీ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

ఎక్కువ ప్రచారం..

ఎన్నికల ముందు హెల్త్ కార్డులు పంపిణీ చేయడం వల్ల సర్కారుకు పెద్దగా ఖర్చు ఉండదని, కానీ అధికార పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుందని అధికార వర్గాల్లో టాక్. ప్రతి గ్రామంలో కార్డుల పంపిణీ పేరుతో ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపట్టేందుకు చాన్స్ ఉంటుంది. అలాగే కార్డుపై కేసీఆర్ బొమ్మ ఉండటం, ఎన్నికల ముందు వీటిని ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం మూలంగా ఓటింగ్‌పై పాజిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అందుకే షెడ్యూలు వచ్చేలోపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయిన తర్వాత స్కీంపై మరింత క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story