టీ.బీజేపీ సంచలన నిర్ణయం.. వాళ్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు!

by GSrikanth |
టీ.బీజేపీ సంచలన నిర్ణయం.. వాళ్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను రాబట్టుకోవడంపై బీజేపీ దృష్టి సారిస్తోంది. దాదాపు 48 సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇటీవల రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని, అందుకే బీసీ మార్క్ తో ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ బీసీలకు ఇవ్వనన్ని సీట్లు కమలం పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో ముదిరాజ్ కులస్తులకే కనీసం ఐదుకు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఇతర కులాల వారికీ ప్రాధాన్యం ఇస్తూ టికెట్లు కేటాయించాలని భావిస్తోంది.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు దీటుగా..

తెలంగాణలో కాంగ్రెస్ రెడ్ల పార్టీగా, బీఆర్ఎస్ వెలమ, రెడ్ల పార్టీగా ముద్ర పడిన నేపథ్యంలో ఆ రెండు పార్టీలను దెబ్బకొట్టేలా బీసీ కార్డుతో బీజేపీ భారీ స్కెచ్ వేసుకుంది. వారికి బీసీ ఓటు బ్యాంకును దూరం చేసేలా ప్లాన్ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించగా అందులో 23 మంది బీసీలకు అవకాశం కల్పించారు. కాగా, బీసీ సామాజికవర్గంలో మొత్తం 136 కులాలుండగా అందులో కేవలం యాదవ, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి, గంగపుత్ర, వంజరి కులస్తులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీనిపై ఆ సామాజికవర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. పలువురు బీఆర్ఎస్ ను వీడేందుకు సైతం సిద్ధమవుతున్నారు. దీంతో వారిని చేర్చుకోవడంపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది.

40 సీట్లకు తగ్గకుండా...

మరోవైపు కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది. ఆ పార్టీ మహా అయితే 25 నుంచి 30 సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే బహుజనవాదాన్ని వినిపించిన వారిమవుతామని భావిస్తోంది. గతంలో కాషాయ పార్టీకి బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల పార్టీగా ముద్ర పడింది. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఆ సీన్ మారింది. ఆయన బీసీ కావడంతో బీసీల పార్టీగా బీజేపీకి ముద్ర పడింది. బీసీలకు కేంద్రమంత్రి పదవులు దక్కడంతో అగ్ర కులాల పార్టీ అన్న ముద్ర క్రమంగా తగ్గింది. అందుకే బీసీలకు కనీసం 40కి తక్కువ కాకుండా, దాదాపు 48 సీట్ల వరకు ఉండాలని నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది. ఈమేరకు బీఎల్ సంతోష్ సైతం నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే లిస్టును సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేసినట్లు సమాచారం.

ప్రకాశ్ జవదేకర్‌కు ప్రతిపాదనలు..

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు 19, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు 12 ఉన్నాయి. అవి పోగా మిగతా 88 సీట్లలో సగం కంటే ఎక్కువ సీట్లను బీసీలకు కేటాయించాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే బీజేపీలో బీసీ నేతలకు ప్రియారిటీ ఇచ్చిన హైకమాండ్ వారి ఓటు బ్యాంకును రాబట్టుకునే దిశగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు బీజేపీ ప్రియారిటీ కల్పించనుండటంతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ వద్దకు బీసీ నేతలు క్యూ కట్టారు. సెగ్మెంట్ల వారీగా తమ సామాజిక వర్గం నుంచి బలమైన నేతలంటూ పేర్లను ప్రతిపాదించారు.

ముదిరాజ్ మహాసభ రిప్రజెంటేషన్..

కేవలం ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రకాశ్ జవదేకర్ కు ప్రతిపాదనలు చేయడం గమనార్హం. తమకు టికెట్లు కేటాయిస్తే తెలంగాణలో దాదాపు 20 సెగ్మెంట్లలో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. అలాగే మరో 19 మంది నేతలకు జాతీయ, రాష్ట్ర, బాధ్యతలతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రిప్రజెంటేషన్ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story