ఎన్నికల టైమ్‌లో రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. అనుమతి లభిస్తే కేసీఆర్‌కు చిక్కులు!

by GSrikanth |
ఎన్నికల టైమ్‌లో రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. అనుమతి లభిస్తే కేసీఆర్‌కు చిక్కులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిన వ్యవహారంపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తున్నది. దీర్ఘకాలంగా చేస్తున్న ఆరోపణలకు తాజా ఘటనను ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలనుకుంటున్నది. పకడ్బందీగా వ్యవహరించి ఒకేసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నది. బ్యారేజీ భద్రత, ప్రజల ప్రాణాలకు పొంచిన ముప్పు, ప్రజాధనం దుర్వినియోగం.. ఇలాంటి అంశాలతో దర్యాప్తు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని భావిస్తున్నది. కేంద్రం సానుకూలంగా స్పందించినా, స్పందించకున్నా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానికి తలనొప్పిని సృష్టించాలనుకుంటున్నది.

సింగిల్ కంప్లయింట్‌తో రెండు పార్టీలకూ చిక్కులు తెచ్చేలా మాస్టర్ స్ట్రోక్ వేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ తాజా ఘటనపై ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ ఢిల్లీ నుంచి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను ఆశ్రయిస్తానన్నారు. ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాసే సంగతి ఎలా ఉన్నా రాజకీయంగానూ ఈ అంశాన్ని ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకుని బీజేపీ, బీఆర్ఎస్‌ను కార్నర్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేయాలనుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కోసం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ కోసం ప్రయత్నం చేయనున్నది.

ఒక్క దెబ్బతో రెండు పార్టీలకు చిక్కులు

మేడిగడ్డ ఇన్సిడెంట్‌పై కేంద్రానికి కాంగ్రెస్ రాసే లేఖ అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెక్ పెట్టడానికి, ఇటు పొలిటికల్‌గా మైలేజ్ పొందడానికి కీలకంగా మారనున్నది. కాంగ్రెస్ రిక్వెస్టుకు అనుగుణంగా దర్యాప్తు జరిపించేలా కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే అది కేసీఆర్‌కు చిక్కులు తెచ్చి పెడుతుంది. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీశ్‌రావు మెడకూ అది చుట్టుకుంటుంది. ప్రాజెక్టు కట్టిన నిర్మాణ సంస్థ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ‘కాగ్’ వేసిన అక్షింతలు కీలకంగా మారుతాయి. కాళేశ్వరం కోసం చేసిన అప్పులు, ఖర్చు, చెల్లిస్తున్న వడ్డీ, గత వరదల్లో పంప్ హౌజ్ నీట మునగడం.. ఇవన్నీ మరోసారి తెరమీదకు వస్తాయి. సీఎం కేసీఆర్‌పై ఇప్పటికే ఉన్న ఆరోపణలు మరింత వేడెక్కుతాయి. ఒకవేళ దర్యాప్తుకు సానుకూలంగా స్పందించకుంటే కేసీఆర్‌ను కాపాడడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రజల్లో ఆ పార్టీని ఎక్స్ పోజ్ చేయడానికి కాంగ్రెస్‌కు మార్గం సుగమమవుతుంది.

బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అయినందునే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపడంలేదని ఒకేసారి రెండు పార్టీలను టార్గెట్ చేయడానికి వీలు చిక్కుతుంది. దీనికి తోడు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితరులంతా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని, అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలను ఉదహరించి ఆ రెండూ ఫ్రెండ్లీ పార్టీలేనంటూ ప్రచారం చేసుకోడానికి వాడుకునే చాన్స్ ఉన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అడ్వాన్స్ కావడానికి మేడిగడ్డ తాజా ఇష్యూను కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోనున్నది.

రేవంత్ వ్యూహాత్మక అడుగులు

ఇంతకాలం కాళేశ్వరం అంశాన్ని కేసీఆర్ గొప్పదనంగా చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించడానికి సాహసించలేని తీరులో పీసీసీ చీఫ్ అడుగులు వేయాలనుకుంటున్నారు. రాహుల్‌గాంధీ.. మంథని, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో పర్యటిస్తూనే కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు. కానీ రాహుల్ చేసిన కామెంట్లకు అనుగుణంగా రోజుల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన వార్తలు రావడాన్ని కాంగ్రెస్ ఇకపైన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని భావిస్తున్నది. పార్టీ నేతలు స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి కేసీఆర్‌ను చిక్కుల్లోకి నెట్టాలనుకుంటున్నారు.

బ్యారేజీని సందర్శించేందుకు పోలీసుల నుంచి పర్మిషన్ వస్తే దాని నిర్మాణంలో లోపం ఉన్నదని, డొల్లతనం బయటపడిందని విమర్శించడానికి ఆస్కారం లభిస్తుంది. ఒకవేళ పోలీసుల అనుమతి రాకుంటే కేసీఆర్ భయపడుతున్నందునే బ్యారేజీ పరిశీలనకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రజల్లో చెప్పుకోడానికి అవకాశం దొరుకుతుంది. ఎన్నికల కోడ్‌తో అధికారాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతికి వెళ్లినా కేసీఆర్ ఇప్పటికీ మేనేజ్ చేస్తున్నారని విమర్శించడానికి వీలు చిక్కుతుంది. ఇంజినీర్లను నోటి మాటతో కంట్రోల్ చేస్తున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి దారి దొరికినట్లవుతుంది. ఈ ఇష్యూను వీలైనంత ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ పొందేందుకు వాడుకోవడంతో పాటు బీఆర్ఎస్, బీజేపీలను ఉచ్చులోకి లాగడానికి కాంగ్రెస్ వాడుకోవాలనుకుంటున్నది.

Advertisement

Next Story

Most Viewed