- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎటూ తేలని గోషామహల్ అభ్యర్థి ఎంపిక.. రోజు రోజుకూ పడిపోతున్న పార్టీ గ్రాఫ్!
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని నాలు సెగ్మెంట్లు మినహా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక్కడ మాత్రం పెండింగ్ పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంఐఎం సూచించిన అభ్యర్థికే టికెట్ దక్కుతుందని కొంతమంది, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారని మరికొంత మంది, ఇవేకాకుండా ఉత్తర భారతీయులకు ఇస్తారని, తెలుగు వాళ్లకే టికెట్ వస్తుందని ఇలా అనేక విధాల వదంతులు షికారు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి సుమారు రెండు నెలలు కావస్తున్నా గోషామహల్ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఓ అంచనాకు రాలేకపోవడంతో టికెట్ ఆశిస్తున్న నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
అందని ద్రాక్షగా..?
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అందని ద్రాక్షగా మారింది. అక్కడ తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఏర్పాటు అనంతరం 2014, 2018లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్రమంతా బీఆర్ఎస్ గాలి వీచినా ఇక్కడ మాత్రం కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 2014లో నాల్గవ స్థానం, 2018లో రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తర భారతీయులు అధికంగా ఇక్కడికి వలసవచ్చి నివాసముంటుండడం, వ్యాపారులు అధికంగా ఉండడం బీజేపీకి కలిసి వస్తోంది. దీనికితోడు బీఆర్ఎస్‌లో వర్గపోరు, ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తుండడం పార్టీకి నష్టం చేస్తోంది. ప్రభుత్వ పథకాలను ముందుండి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన నాయకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో పార్టీ కోసం సైనికుల్లా పని చేసిన వారు కొంతమంది బీజేపీలోకి మారే దుస్థితి కనబడుతోంది.
ఇన్‌చార్జి మార్పుతో మరింత జఠిలం?
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గోషామహల్ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు పార్టీకి ఇక్కడ అంతగా పట్టులేదు. ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులను మార్చడం కలిసి రావడం లేదు. 2014లో పోటీ చేసిన ధూత్‌ను పక్కనపెట్టి 2018లో ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు టికెట్ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ పర్యాయం తిరిగి రాథోడ్ కే టికెట్ ఇస్తే కొంత సింపతి పనిచేసే అవకాశాలు ఉన్నప్పటికీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు ఇటీవల పార్టీ ఇన్‌చార్జిగా నియమించిన నందకిషోర్ వ్యాస్ మీద ఉన్న వ్యతిరేకతతో పార్టీలో ఇతర నాయకులు అంటీముట్టనట్లుగా పని చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ ఇద్దరు నాయకుల మధ్య సఖ్యతలేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. ఇక్కడ అధిక సంఖ్యలో నాయకులు బీఆర్ఎస్ పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. ఉద్యమ నాయకులమని కొంతమంది, పార్టీలో సీనియర్లమని మరి కొంతమంది పోటీకి తహతహలాడుతున్నారు. వీరే కాకుండా మాజీ కార్పొరేటర్లతో పాటు డివిజన్ స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందేకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ టికెట్ కోసం ఈ నియోజకవర్గంలోని నాయకుల మధ్య ఉన్న పోటీ ఏఇతర నియోజకవర్గాలలో లేదు.
పార్టీ మారేందుకు చూస్తున్న నేతలు?
గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఆలస్యమౌతుండడంతో పార్టీలోని కొంతమంది నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో చేరాలనే తలంపుతో ఉన్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. బీజేపీలో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల వైపు దృష్టిసారిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్‌లో చేరితే ఎలా ఉంటుందనేది సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారని తెలిసింది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమౌతుండగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. ఇన్‌చార్జి నందకిషోర్ వ్యాస్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించేవారు కొంతమందైతే, తమకు దక్కే అవకాశం లేదని తెలుసుకుని పక్క చూపులు చూస్తుండడం అధికార పార్టీకి నష్టం చేకూరేలా ఉంది.