ప్రభుత్వ ఏర్పాటుపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫోకస్

by GSrikanth |
ప్రభుత్వ ఏర్పాటుపై కేసీఆర్,  కేటీఆర్, హరీశ్‌రావు ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెజార్టీ బీఆర్ఎస్ లీడర్లు ఓడిపోతున్నామని మానసికంగా రెడీ అయ్యారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నిర్ణయానికి వచ్చారు. కానీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ మాత్రం తామే అధికారంలోకి వస్తున్నామనే ధీమాలో ఉన్నట్టు తెలుస్తున్నది. తమను కలిసిన లీడర్లకూ ఇదే విషయాన్ని చెబుతూ ‘కంగారు పడొద్దు. అధికారంలోకి వస్తున్నాం. మరో ఐదేళ్లపాటు మనమే రాష్ట్రాన్ని పాలిస్తున్నాం’ అని వివరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

మనమే గెలుస్తున్నాం

ఎగ్జిట్ పోల్స్‌ను చూసిన తర్వాత మెజార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఓడిపోతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని తమ అనుచరులు, కేడర్‌కు వివరిస్తున్నారు. ఎక్కువశాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించాయి. కానీ మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో పోలింగ్ సరళిపై పలు దఫాలుగా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్, కేటీఆర్ సమీక్షలు నిర్వహించినట్టు తెలిసింది. ఆ ముగ్గురు లీడర్లు మాత్రం ఆ ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుపడతూ, తమ వద్ద ఉన్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే తీరుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ప్రగతిభవన్‌కు వెళ్లిన లీడర్లకు, ఫోన్ చేసిన నాయకులకు వివరిస్తున్నట్టు సమాచారం. ‘మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.’ అని ధీమాగా ఉన్నారని కొందరు బీఆర్ఎస్ లీడర్లు తమ అనుభవాలను వివరించారు.

ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్

మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమాలో ఉన్న సీఎం కేసీఆర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రోజున శాసనసభ్యులతో మీటింగ్ పెట్టాలి? ఎప్పుడు ప్రమాణస్వీకారం చేయాలి? తనతో పాటు ఎందరి మంత్రులతో ప్రమాణం చేయించాలి? మొత్తం కేబినెట్‌ను ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై ఆయన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story