కాంగ్రెస్ మీద బురద జల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం.. కుండబద్దలు కొట్టిన కర్ణాటక రైతులు!

by GSrikanth |
కాంగ్రెస్ మీద బురద జల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం.. కుండబద్దలు కొట్టిన కర్ణాటక రైతులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కర్ణాటక పాలిటిక్స్ మొదలయ్యాయి. అక్కడి పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా.. ఆ పథకాలన్నీ బీఆర్ఎస్ తూచ్ అంటోంది. కరెంటు కోతలపై అక్కడి రైతులతో నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. అయితే కిరాయికి తెచ్చి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతుండగా.. కాదు కరెంటు ఇవ్వకపోవడంలేదు కాబట్టి వారే వచ్చి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పేర్కొంటున్నది. కన్నడ రైతులు మాత్రం రోజువారీ కూలీకి వచ్చామని చెప్పడం కొసమెరుపు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టినట్లయింది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు పెంచుతున్నాయి. మరోవైపు కర్ణాటక పాలిటిక్స్ తెలంగాణలో ప్రారంభం అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఐదుగ్యారెంటీలతో విజయం సాధించిన కాంగ్రెస్, తెలంగాణలోనూ 6 గ్యారెంటీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రచార స్పీడ్ పెంచింది. ఇచ్చిన గ్యారెంటీలను ఆ రాష్ట్రంలో చేసి చూపించామని, తెలంగాణలోనూ అమలుచేస్తామని నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చిందంటే తప్పక నెరవేస్తుందని వివరిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను పదేళ్లలో కూడా నెరవేర్చలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్.. కర్ణాటకకు వచ్చి రుజువు చేసుకోవాలని సవాల్ చేస్తున్నారు.

కానీ వాటిని బీఆర్ఎస్ అంతా తూచ్ అని ఖండిస్తోంది. శక్తిపేరుతో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన ప్రయాణం ఫెయిల్ అయిందని, అన్నభాగ్య పథకం సైతం కింద బియ్యం బదులు డబ్బులు ఇస్తామంటూ ఇవ్వడం లేదని, డిగ్రీపాసైన యువతకు నిరుద్యోగ భృతి, గృహలక్ష్మి కింద మహిళా ఖాతాల్లో నెలకు రూ. 2 వేలు ఇస్తామని ఇవ్వడం లేదని చెబుతోంది. ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్, వ్యవసాయరంగానికి 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదనే అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటక రైతులను తీసుకొచ్చి ఇక్కడ రైతులతో నిరసనలకు శ్రీకారం చుట్టింది. దీనిపై కాంగ్రెస్ సీరియస్‌గా రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికింది.

బెడిసి కొట్టిన గులాబీ వ్యూహం

బీఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించింది. దీంతో ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కర్ణాటక రైతులు నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో హల్‌చల్​చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నినదిస్తూ కర్ణాటకకు చెందిన వ్యక్తులు కొడంగల్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హామీలను, గ్యారంటీలను ప్రజలు నమ్ముతున్నారనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ కర్ణాటకకు చెందిన పెయిడ్ ఆర్టిస్టులతో ఇక్కడ ర్యాలీలు చేయిస్తోందనే ఈ విషయాన్ని సదరు కర్ణాటక వ్యక్తులే వెల్లడిస్తున్నారు. డబ్బులు ఇచ్చారని.. అందుకే ర్యాలీ చేశామని వాళ్లు మీడియాకు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరంతా కేవలం రూ.300 కూలీ కోసం ఓ ఏజెంట్ ద్వారా రైతుల వేషంలో పరిగి వచ్చారని విచారణలో తేలింది.

సదరు ఏజెంట్​ఎలా చెబితే తాము అలా చేశామని, చివరకు తమను పరిగిలోనే వదిలి వెళ్లిపోయారని ఆ వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోట్రిక ప్రాంతం నుంచి తాము పరిగి వరకు వచ్చామని చెప్పారు. పరిగిలో నిరసన చేపట్టిన వారికి కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నిరసన కారులను అడ్డుకుని ప్లకార్డులు చింపేశారు. దీంతో ఏజెంట్లతో కర్ణాటక ప్రజలను తీసుకొచ్చి రైతుల పేరిట నిరసన కార్యక్రమాలు చేయించిన విషయంలో బయటకు రావడంతో ఒక్కసారిగా గులాబీ వ్యూహం బెడిసికొట్టినట్లయింది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏవేవో చేస్తామని చెప్పే బదులు వాటిని ఇప్పుడే అమలు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘కేటీఆర్.. ఇదిగో నీ డ్రామాల బండారం’ అంటూ కాంగ్రెస్ నాయకులు ట్వీట్ చేశారు. కిరాయి మనుషులతో కాంగ్రెస్ మీద బురద జల్లుతారా? అని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed