BRS మేనిఫెస్టోపై సొంత నేతలు నిరుత్సాహం.. పసిగట్టిన అగ్ర నాయకత్వం!

by GSrikanth |
BRS మేనిఫెస్టోపై సొంత నేతలు నిరుత్సాహం.. పసిగట్టిన అగ్ర నాయకత్వం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఎప్పటికప్పుడు ఇన్‌పుట్స్ తీసుకునే బీఆర్ఎస్.. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నది. గతంలో రెండుసార్లు మేనిఫెస్టోలు రిలీజ్ చేసినప్పుడు సొంత పార్టీ నేతల్లో కనిపించిన స్పందన ఈసారి వ్యక్తం కాలేదని పార్టీ అగ్ర నేతలు గ్రహించారు. కేవలం ఒకటే కొత్త హామీ ఉన్నదని, మిగిలినవన్నీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్‌ను పోలి ఉన్నాయనే కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో గురించి ప్రజలు చర్చించుకుంటున్న అంశాలను తెప్పిస్తున్నది.

జిల్లా మంత్రులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న గులాబీ అభ్యర్థులతో పాటు జిల్లాల పార్టీ నాయకులు, స్థానిక లీడర్ల ద్వారా ఫీడ్ బ్యాక్‌పై ఆరా తీస్తున్నారు. సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలే ప్రజల్లోనూ ఉన్నాయా?.. లేక పదేండ్ల ఆచరణను చూసిన తర్వాత ఈ హామీలు అమలవుతాయనే కాన్ఫిడెన్సుతో ఉన్నారా?.. ఇలాంటి వివరాలను పార్టీ నాయకత్వం సేకరిస్తున్నది. పార్టీల లీడర్లు, కేడర్ సంగతి ఎలా ఉన్నా రైతులు, ఇప్పటికే పలు పథకాల కింద సాయం అందుకుంటున్న లబ్ధిదారుల్లో జరుగుతున్న చర్చల వివరాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈసారి వైట్ రేషన్ కార్డులున్న కుటుంబాలన్నింటికీ ప్రభుత్వమే ఉచితంగా జీవిత బీమా కల్పించే హామీ గురించి ఆరా తీస్తున్నది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పటికే మేనిఫెస్టోలోని అంశాలను వైరల్ చేస్తున్నది.

కాంగ్రెస్‌ గ్యారంటీస్‌తో వస్తున్న తంటా

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు డిక్లరేషన్లు, సిక్స్ గ్యారంటీస్‌తో వివిధ సెక్షన్ల ప్రజలకు హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా వీటిని పెట్టాలనుకుంటున్నది. ఈ గ్యారంటీలు, డిక్లరేషన్ హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ఎలాంటి కాన్ఫిడెన్సు కలిగించిందనేది కీలకంగా మారింది. సిక్స్ గ్యారంటీస్ వెళ్లినంత లోతుగా మేనిఫెస్టోను కూడా తీసుకెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఆదేశించారు. కరపత్రాలు, బుక్‌లెట్ రూపంలో ప్రింట్ చేసి ప్రతి ఇంటికీ చేరవేసేలా ఆయా చొరవ తీసుకోవాలని సూచించారు. సిక్స్ గ్యారంటీలు ఊరూ వాడా చేరాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్న సమయంలో కేసీఆర్ ఈ సూచనలు చేయడం గమనార్హం.

నాలుగు నెలలుగా హైరానా

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోని బీఆర్ఎస్ నాలుగు నెలలుగా హైరానా పడుతున్నది. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలకు గ్యారంటీ లేదని, ఆ పార్టీకే వారంటీ అయిపోయిందంటూ గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి విమర్శలను దృష్టిలో పెట్టుకునే పీసీసీ రేవంత్ ఇటీవల “మా పార్టీ గ్యారంటీలను బీఆర్ఎస్ నేతలే బాగా ప్రచారం చేస్తున్నారు” అంటూ సెటైర్ వేశారు. ఇప్పటివరకూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ తదితరులు కాంగ్రెస్ గ్యారంటీలు, డిక్లరేషన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయగా తాజాగా కేసీఆర్ సైతం జనగాం సభలో ఆ పార్టీనే టార్గెట్ చేశారు. వంద జాకీలు పెట్టినా ఆ పార్టీ లేవదని కామెంట్ చేసిన గులాబీ నేతలే ఇప్పుడు ఆ పార్టీ గ్యారంటీలను తూర్పారపడుతున్నారు.

మేనిఫెస్టో దీటుగా రీచ్ కావాలి

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌లోని అంశాలు, సిక్స్ గ్యారంటీస్ ప్రజల్లోకి వెళ్లినదానికి దీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని హామీలను కూడా తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. ప్రజలను కన్విన్స్ చేసే బాధ్యతను ఆ పార్టీ స్థానిక నేతలకు అప్పజెప్పింది. పదేండ్ల ఆచరణ, రానున్న కాలంలో హామీల అమలుపై నమ్మకం కలిగించి అన్ని సెక్షన్ల ప్రజలకు దగ్గర కావాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. ఇకపైన కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలన్నింటా బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను నొక్కిచెప్పనున్నారు. కేసీఆర్ స్పీచ్, పార్టీ మేనిఫెస్టోయే అభ్యర్థులకు ఆశాదీపంగా ఉన్నాయి.

Advertisement

Next Story