ఆ నియోజకవర్గాలపై కాంగ్రెస్ మరింత ఫోకస్.. ఖాతాలో పడ్డట్లేనా?

by GSrikanth |
ఆ నియోజకవర్గాలపై కాంగ్రెస్ మరింత ఫోకస్.. ఖాతాలో పడ్డట్లేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 25 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉన్నట్లు గుర్తించింది. ఆ నియోజకవర్గాలపై కాస్త ఫోకస్ పెడితే కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తున్నది. దీంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆ 25 నియోజకవర్గాల్లో స్ట్రాటజిస్టుల టీమ్ లు రంగంలోకి దిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు మెదక్ జిల్లాలకు ఈ టీమ్ లు చేరుకున్నాయి. పోలింగ్ డే వరకు ఆ స్ట్రాటజిస్టు టీమ్ లు నియోజకవర్గాల్లోనే పనిచేయనున్నాయి. పార్టీ విజయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నాయి.

స్థానికంగా ఉండే సోషల్ మీడియా, టీపీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ శ్రేణులతో కలసి ఈ టాస్క్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. స్ట్రాటజిస్టులు తమ మెదళ్లకు పదును పెట్టి రాబోయే మూడు వారాల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన యాక్టివిటీస్ ను పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడాలి? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి? ఏయే అంశాలను హైలైట్ చేయాలి? వంటి అంశాలను కూడా స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు తెలియపర్చనున్నారు.

టఫ్ పైట్ నేపథ్యంలో..

సుమారు 25 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. దీంతో తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనదైన శైలిలో వ్యూహాలను ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ప్రధానంగా పొల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టింది. గ్రౌండ్ నుంచి ప్రతి కార్యకర్తపై బాధ్యతను పెంచేలా వ్యూహాలను అమలు చేయనున్నది. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి పొలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వరకు కార్యకర్తలు వాళ్లతోనే ఉండేలా వారిని ప్రిపేర్ చేయనున్నారు. హస్తం గుర్తుకే ఓటు వేసేలా ఓటర్ మైండ్ ను ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ టీమ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది.

ఆరు గ్యారెంటీలపై సెకండ్ రౌండ్

మొదటి దశ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఇప్పటికే పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది. టఫ్ ఫైట్ ఉన్న 25 నియోజకవర్గాల్లో ఆరు గ్యారెంటీలు వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మరోసారి వివరించేందుకు పార్టీ సిద్ధమైంది. దీంతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, టీపీసీసీ నేతలు ఇదే నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా తిరగాలని పార్టీ ప్లాన్ చేసింది. ఈ 25లో ఎక్కువ సీట్లు పొందడం వలన మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా రీచ్ అవ్వొచ్చని, తద్వారా పవర్ లోకి రావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed