అలా జరిగి ఉంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరేలా ఉండేది: చిదంబరం

by GSrikanth |
అలా జరిగి ఉంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరేలా ఉండేది: చిదంబరం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రైస్తవులు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో మతపరమైన స్వేచ్ఛ అణిచివేయబడిందని గుర్తుచేశారు.

తనకు తెలుగు రాకున్నా 10,12 ఏళ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అర్ధం అయ్యేది.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు వేరే ఉండేదని అన్నారు. ఎంతో అభివృద్ధిని జరిగి ఉండేదని.. ఇప్పుడు అదంతా ఒకే ఇంటికి పరిమితమైందని కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో CWC మీటింగ్‌ జరిగిందని.. అలాంటి మీటింగ్ నా జీవితంలో చూడలేదని అన్నారు. ఆ సభలో 45 శాతం 25 ఏళ్ల యువకులు ఉన్నారు. సభ చూశాక, తెలంగాణలో మార్పు తథ్యం అని అర్ధమైంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంలా మారింది. అప్పులు భారీగా పెరిగాయి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది పట్టడం లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో జీవిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు రక్షణ కవచం లాంటిదని.. దానిని అందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed