మనల్ని మనమే సెల్ఫ్ గోల్ చేసుకున్నాం.. చివర్లో రియలైజ్ అయిన కేసీఆర్

by GSrikanth |
మనల్ని మనమే సెల్ఫ్ గోల్ చేసుకున్నాం.. చివర్లో రియలైజ్ అయిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. సుడిగాలి పర్యటనలు చేసి ప్రజల్లోకి వెళ్లినా ఆశించిన ఫలితాలు రాలేదనే నిరుత్సాహం గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. పైగా సిక్స్ గ్యారెంటీస్‌‌పై విమర్శలు చేసి తప్పు చేశామనే భావన వారిలో వ్యక్తమవుతున్నది. దాని వల్ల కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరిందనే చర్చ మొదలైంది. మేడిగడ్డ ఇష్యూపై భిన్నంగా కామెంట్లు చేయడంతో ప్రజల్లో మరిన్ని అనుమానాలు రెకెత్తించినట్టయిందనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. రేపటితో ప్రచారం ముగియనున్నది. దీంతో ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని అస్త్రాలూ ఫెయిల్ కావడంతో తాజాగా సెంటిమెంట్ తెరమీదను తెచ్చారు. అది కూడా వర్కవుట్ కాదనే భావనతో పోల్ మేనేజ్‌మెంట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కింకర్తవ్యంపైనే లోతుగా చర్చలు జరుగుతున్నాయి.

గో బ్యాక్ నినాదాలు

నిజానికి కాంగ్రెస్ కన్నా ముందే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినా హస్తం పార్టీ దూకుడుకు తగిన జవాబు చెప్పలేకపోయామని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయామనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమైంది. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు నిలదీయడం, గో బ్యాక్ అని నినదించడం ఇందుకు నిదర్శనమని, కేసీఆర్ సభ తర్వాత కూడా ఇవి రిపీట్ అయ్యాయని ఉదహరించారు. పథకాల అమల్లో తేడాలతోనే ప్రజా వ్యతిరేకత పెరిగిందనే భావనకు వచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీలను విమర్శించడానికి బదులుగా పదేండ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా ప్రచారం చేసి మేనిఫెస్టోలోని అంశాలను జనంలోకి తీసుకెళ్తే బాగుండేదన్న అభిప్రాయం ఇప్పుడు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఒక రకంగా సిక్స్ గ్యారెంటీస్‌పై కాంగ్రెస్ ప్రచారం, తమ విమర్శలతోనే ఎక్కువగా ప్రచారం చేశామనే అభిప్రాయాన్ని ఓ గులాబీ నేత వ్యక్తం చేశారు.

మేడిగడ్డ డ్యామేజ్‌తో బ్యాక్ ఫైర్

మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో రాహుల్‌గాంధీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినా సెంట్రల్ టీమ్ రిపోర్టు తర్వాత అది రివర్స్ అయిందనే భావన బీఆర్ఎస్‌లో నెలకొన్నది. ఎన్ని వివరణలు సంజాయిషీలు ఇచ్చుకున్నా మేడిగడ్డ ఘటన నెగెటివ్ అయిందని, మీడియా ద్వారా సమర్ధించుకోవాలని చేసిన ప్రయత్నాలు సైతం బ్యాక్‌ఫైర్‌గా మారినట్టు ఆ పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారు. బ్యారేజీ నిర్మాణంలో లోపాలు జనంలోకి విస్తృతంగా వెళ్లడంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే అనుమానాలు తావిచ్చిందనే భావన వారిలో వ్యక్తమవుతున్నది. ఆ ఘటనపై భిన్నమైన కామెంట్స్ చేయడం.. ప్రజల్లో మరిన్ని అనుమానాలకు కారణమైందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మూడోసారి గెలుపునకు కాళేశ్వరం ప్రాజెక్టును బలమైన అస్త్రంగా వాడుకోవాలనుకున్నా మేడిగడ్డ ఇన్సిండెంట్‌తో మొత్తం వ్యూహం బెడిసికొట్టినట్లయిందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

దెబ్బకొట్టిన కర్ణాటక కామెంట్స్

రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం కలిగిన బలమైన ప్రాంతీయ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నా, తెలంగాణ సాధించిన పార్టీగా ప్రచారం చేసుకుంటున్నా, మళ్లీ గెలుపు ఖాయం అని జనాన్ని నమ్మిస్తున్నా కాంగ్రెస్ వేవ్‌ను కట్టడి చేయలేకపోయామని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ గెలుపు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం సొంత గడ్డమీదనే ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే నిరాశ గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా వారికే మళ్లీ పోటీచేసేందుకు అవకాశం కల్పించడం తప్పిదమేమోననే పశ్చాత్తాపం పార్టీ ఇన్‌చార్జుల్లో వ్యక్తమవుతున్నది. లోకల్ కేడర్ సహకరించకపోవడం కూడా మైనస్‌గా మారింది. ఈసారి ఎన్నికల్లో పాజిటివ్ క్యాంపెయిన్‌కు బదులుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నెగెటివ్ ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందనే అభిప్రాయమూ బీఆర్ఎస్ లీడర్లలో నుంచి వినిపిస్తున్నది. సిక్స్ గ్యారెంటీస్‌కు దీటుగా మేనిఫెస్టో అంశాలను, పదేండ్ల ప్రగతిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి బదులుగా ‘ఆ పార్టీ గెలిస్తే.. వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలు.. రాహుల్‌గాంధీ పప్పు.. ఇందిరమ్మ రాజ్యంలో అంధకారం..’ లాంటి కామెంట్లతో బీఆర్ఎస్‌కు మరింత డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయానికి వచ్చారు. కర్ణాటకలో ఫైవ్ గ్యారెంటీస్ అమలు కావడంలేదని, అక్కడి రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారని ప్రచారం చేయడాన్ని కూడా జనం స్వీకరించలేదని రియలైజ్ అయ్యారు. కర్ణాటకకు వ్యతిరేకంగా ఎక్కువ ప్రచారం చేయడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ఉపయోగపడిందనే నిర్ధారణకు వచ్చారు.

కేసీఆర్, కేటీఆర్‌తోనూ పెరగని మైలేజ్

గత ఎన్నికల్లో కేసీఆర్ ఇమేజ్ బాగా దోహదపడిందని, ఈసారి అది కూడా వర్కవుట్ కాలేదని పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేలా, ప్రభుత్వ వైఫల్యాలను కవర్ చేసుకునేలా కేటీఆర్ చేసిన పలు కామెంట్స్.. బీఆర్ఎస్‌ను బాగా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. ప్రవళిక సూసైడ్, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీ, చంద్రబాబు నాయుడి అరెస్టు, ఐటీ ఉద్యోగులు సిటీలో చేసిన నిరసనలు, టీ-వర్క్స్ ఆవరణలో నిర్వహించిన చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ బెడిసికొట్టాయనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్‌పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌ను చూసి బీఆర్ఎస్ భయపడుతున్నదనే మెసేజ్ జనంలోకి వెళ్లిందని గులాబీ నేతల అభిప్రాయం. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, దళితబంధు, ఆసరా పింఛన్లు తదితరాలు చాలా మంది పేదలకు అందకపోవడం, ప్రచారంలో అభ్యర్థులను ప్రజలు నిలదీయడం, వాటికి కన్విన్స్ చేసే తీరులో సమాధానం చెప్పడానికి బదులుగా రాష్‌గా వ్యవహరించడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో జనం నుంచి దూరం కావడానికి కారణమైందనే భావన ఏర్పడింది. ధరణి గురించి గొప్పగా చెప్పుకుంటున్న సమయంలో కొన్ని సమస్యలున్నది నిజమేనని కామెంట్ చేయడం ఇబ్బందికరంగా మారిందన్న మాటలు గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందరికీ చేరకపోవడానికి కారణాలను వివరించి మనసును గెల్చుకోవడంలో విఫలమయ్యామనే నిర్ణయానికి వచ్చారు. ఇవే ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలపై నమ్మకం కలగడానికి దారితీసిందని పేర్కొన్నారు.

ఆశలన్నీ పోల్ మేనేజ్‌మెంట్‌పైనే

ఇతర పార్టీలకన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని మొదలుపెట్టినా ప్రజల్లోకి దూసుకెళ్లడంలో మాత్రం కాంగ్రెస్ తో పోటీ పడలేకపోయామనే అభిప్రాయం పలువురు బీఆర్ఎస్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నది. పదేండ్ల పాలనా ఫలాలు, పథకాల ద్వారా జరిగిన లబ్ధి, కేసీఆర్ చరిష్మా, కేటీఆర్ వాక్చాతుర్యం, మేనిఫెస్టోలోని హామీలు.. ఇవేవీ ఈసారి ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే సాధారణ అభిప్రాయానికి వచ్చారు. రెండు రోజులుగా కేసీఆర్ ప్రస్తావిస్తున్న బక్కోడు.. పేగులు తెగేదాక కొట్లాడిన.. 70 ఏండ్ల వయసులో నాకు కావాల్సిందేముంది.. నేను కోరుకున్న తెలంగాణ సాధించడమే అన్నింటికన్నా పెద్ద అచ్చీవ్‌మెంట్.. నాకు పదవులపై ఆశలేదు.. ఇలాంటివి పెద్దగా సెంటిమెంట్ రాజేయడంలేదనే భావనతో ఉన్నారు. దీక్షా దివస్ పేరుతో అమరవీరుల కుటుంబాలను బుధవారం కలిసేలా పెట్టుకున్న కార్యక్రమంతోనైనా మైలేజ్ వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన చిట్టచివరి అస్త్రం పోల్ మేనేజ్‌మెంట్ మాత్రమేననే అభిప్రాయానికి వచ్చారు. ప్రచారం ముగిసిన తర్వాత రోజు చేపట్టే ప్లానింగ్‌పైనే అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Next Story