హత్య కేసులో నిందితులు రిమాండ్

by Sridhar Babu |
హత్య కేసులో నిందితులు రిమాండ్
X

దిశ, కూకట్​పల్లి : ఓ టీ స్టాల్​ వద్ద జరిగిన గొడవలో పరస్పర దాడిలో గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన కేసులో నలుగురు నిందితులను కూకట్​పల్లి పోలీసులు బుధవారం రిమాండ్​కు తరలించారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్​రావు, సీఐ కొత్తపల్లి ముత్తు, డీఐ వెంకటేశంతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 22వ తేదీన జరిగిన గొడవలో గాయపడిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఈనెల 23వ తేదీన కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 22వ తేదీ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కూకట్​పల్లికి చెందిన చెన్నబోయిన పవన్​(22), చెన్నబోయిన శ్రీధర్​(20) వారి సోదరి, వదినలతో కలిసి బీజేపీ కార్యాలయం సమీపంలోని కిరణ్​ మెస్​ ముందు ఉన్న దుర్గా టిఫిన్​ సెంటర్​ వద్ద ఉన్న ఓ టీ స్టాల్​లో టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి గంటిమల్ల వెంకటరమణ (22) తన స్నేహితులు చారపాకు సురేష్​, దేవ మణికంఠ, రమణలతో కలిసి సమీపంలోని దారువాల వైన్స్​లో మద్యం సేవించి అక్కడికి చేరుకుని దుర్గా టిఫిన్​లో సమోసా తింటున్నారు. ఈ క్రమంలో వెంకటరమణ అతడి స్నేహితుల వద్దకు వెళ్లిన చెన్న బోయిన పవన్ తన సోదరిని ఎందుకు చూస్తున్నావు, ఎందుకు కామెంట్​ చేస్తున్నావని గొడవకు దిగాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఈ క్రమంలో పవన్​, శ్రీధర్​లు తమ స్నేహితులు అయిన బానోత్​ సురేష్​(19), గుంటుక అజయ్​(20)లకు ఫోన్​ చేసి పిలిపించారు. గొడవలో పవన్​ హోటల్​లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై బలంగా దాడి చేశాడు. కొద్ది సేపటి తరువాత అందరూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. వెంకటరమణ తన స్నేహితుడు సురేష్​ ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మూత్ర విసర్జనకు వెళ్లిన బాధితుడు కింద పడి పోయాడు. అది గమనించిన సురేష్​ తండ్రి మల్లికార్జున్​ వెంకటరమణను ఇంట్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వాంతులు చేసుకున్నాడు. దీంతో సురేష్​, మల్లికార్జున్​లు బాధితుడిని చికిత్స నిమిత్తం రాందేవ్​ రావు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెంకటరమణ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో సురేష్ కుటుంబ సభ్యులు కూకట్​పల్లి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సురేష్​ రాత్రి టీ స్టాల్​ వద్ద జరిగిన గొడవ విషయాన్ని పోలీసులకు వివరించాడు. దాడిలో వెంకటరమణను పవన్​ చపాతి కర్రతో దాడి చేయడంతో మృతుడి కణతి భాగంలో రక్తం గడ్డ కట్టి మృతి చెందినట్టు గుర్తించారు. దీంతో వెంకటరమణ కుటుంబ సభ్యులు కూకట్​పల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుర్గా టిఫిన్స్​ వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తం అయిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. అదే విధంగా పోస్ట్​ మార్టం రిపోర్ట్​లో తలపై కణత భాగంలో బలంగా దాడి చేయడంతో రక్త ప్రసరణ ఆగి పోవడం కారణంగానే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు వెంకటరమణది హత్యగా కేసును నమోదు చేశారు. సీసీ పుటేజీలో వెంకటరమణపై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసుకుని చెన్నబోయిన పవన్​(22), చెన్నబోయిన శ్రీధర్​(20), వారికి సహకరించిన బానోత్​ సురేష్​(19), గుంటుక అజయ్​(20)లను అదుపులో తీసుకుని రిమాండ్​కు తరలించినట్టు ఏసీపీ శ్రీనివాస్​ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed