‘రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఛానల్‌పై చర్యలు తీసుకోండి’

by GSrikanth |
‘రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఛానల్‌పై చర్యలు తీసుకోండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని, చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోందని బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం ఆరోపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నాడని ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరంపెట్టాలని కోరారు. స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను బీఆర్కే భవన్‌లో బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ ఆధ్వర్యంలో లీగల్ బృందం కలిశారు. కేసీఆర్ శిరచ్చేదం చేయాలని రేవంత్ అనడంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై, రేవంత్‌పై సీఈఓకు నాలుగు ఫిర్యాదులు ఇచ్చామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దురదృష్టవశాత్తు ఈసీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని, అందుకే ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా? అని ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అన్నారు. రేవంత్ మాటలకు కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈసీని గతంలోనే కోరామన్నారు. అయినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అన్నారు. రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ హింసను ఎట్టి పరిస్థితుల్లో సహించదన్నారు. సీఈఓకు అన్ని విషయాలు వివరంగా చెప్పామని, వెంటనే చర్యలు తీసుకోపోతే వ్యవస్థ అరాచక శక్తుల చేతుల్లోకి పోతుందని కూడా విన్నవించినట్లు తెలిపారు. కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చామని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ తెరవెనుక ఉండి సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని, సునీల్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. క్యూన్యూస్‌లో కాంగ్రెస్‌కు నేరుగా ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. స్టడీఐక్యూ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని, దానిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారన్నారు.

Advertisement

Next Story

Most Viewed