సొంత లీడర్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. రాత్రుళ్లు ఏం చేస్తున్నారో తెలుసా?

by GSrikanth |
సొంత లీడర్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. రాత్రుళ్లు ఏం చేస్తున్నారో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉదయం క్యాంపెయినింగ్ చేస్తున్న నేతలు.. రాత్రుల్లో లోకల్ లీడర్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు. గ్రామాలవారీగా పార్టీ కమిటీలతోపాటు తటస్థంగా బలమైన వ్యక్తులతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నారు. విజయం సాధించాక చేయబోయే పనులకు హామీలు ఇస్తున్నారు. గ్రామాలవారీగా పెండింగ్ పనులకు సైతం నిధులు మంజూరు చేస్తామని, పాత బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. వీటితోపాటు పదవుల హామీలు, ప్యాకేజీలు అందజేస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని భరోసా కల్పిస్తున్నారు. ఆ ప్రభుత్వంలో మనం ఉంటే మీకు మరిన్నీ అవకాశాలు వస్తాయని, అండగా ఉంటానని అభయమిస్తున్నట్లు సమాచారం.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఆరా

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కిందిస్థాయి కేడర్ అసంతృప్తి ఉన్నది. దీంతో పార్టీలో ఉండి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా? అని అభ్యర్థులు తీస్తున్నారు. గ్రామాలవారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఇతరపార్టీల నుంచి వచ్చినవారెవరూ? ఇప్పుడు వారి పనితీరు ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటున్నారు. పార్టీలో ఎలాంటి రోల్ ప్రదర్శిస్తున్నారనే వివరాలను సైతం తెలుసుకొని వారికి పరోక్షంగా హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లు తెలిసింది. పార్టీలో కొనసాగుతూ వ్యతిరేక కార్యక్రమాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

పదవులు, బిల్లులపై భరోసా

గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీలో, నామినేటెడ్ పదవులు ఇస్తామని అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు. ఓటర్లకు చేస్తున్న మోటివేషన్ బట్టి వారికి సముచితస్థానం కల్పిస్తామని, కేవలం పదిరోజులు కష్టపడితే ఐదేళ్లు మనదేనని పేర్కొంటున్నారు. ఏమైనా అసంతృప్తి ఉంటే చెప్పాలని, దానికి పరిష్కార మార్గం చూపుతానని చెబుతున్నట్లు తెలిసింది. అదే విధంగా వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీలు, సొసైటీ సభ్యులకు సైతం భరోసా ఇస్తున్నట్లు సమాచారం.

ఓటర్లందరికీ ఫోన్లు, స్లిప్పులు

లోకల్ లీడర్లతో గ్రామాల్లోని ఓటర్లతోపాటు వలస వెళ్లిన వారికి సైతం అభ్యర్థులు ఫోన్లు చేయిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని వారిని కోరుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లోనూ గడపగడపకు తిరిగి ఓటర్ స్లిప్పులు అందజేస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే, పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్‌తో సాధ్యమని వారికి చెబుతున్నారు. మరోవైపు స్థానిక లీడర్లు సైతం.. ఎమ్మెల్యే అభ్యర్థిని కాకుండా తమను చూసి ఓటు వేయాలని కోరుతుండడం గమనార్హం.

Advertisement

Next Story