బీజేపీ తెలంగాణ ప్లాన్ రివర్స్.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ!

by GSrikanth |
బీజేపీ తెలంగాణ ప్లాన్ రివర్స్.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో ప్రత్యర్థిని అభివృద్ధి, ఇతర అంశాల్లో నిలదీసి ఇరుకున పెట్టే రోజులు పోయి.. ఇప్పుడు ఏకంగా అవతలి వ్యక్తులను డ్యామేజ్ చేసేందుకు సినిమాలు తీస్తున్న రోజులు వచ్చాయి. గతేడాది వచ్చిన సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. అయితే ఇది గత ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. ఈ ట్రెండ్ ను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలని భావించిన కమలం పార్టీ రజాకార్ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ విడుదలను చిత్ర బృందం వాయిదా వేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.


తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రజాకార్ మంచి మైలేజ్ వస్తుందని కమలనాథులు, శ్రేణులు, కార్యకర్తలు భావించారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేయకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ సినిమాలో నిజాం, రజాకార్ల అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తామని మూవీ యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచింది. ఒక్క ట్రైలర్ తోనే పలు సామాజికవర్గాల్లో అలజడి సృష్టించింది. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే.. ఇంకొందరు నెగెటివ్ గా స్పందించారు. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఫిర్యాదులు వచ్చినా? నెగెటివ్ టాక్ వచ్చినా? వాస్తవాలే సినిమాలో చూపించనున్నట్లు యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తమ మూవీపై విమర్శలు వచ్చినా తమకే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

రాజకీయాలకు సినిమా గ్లామర్ టచ్ కావడం గత ఎన్నికల నుంచి మరింత ఎక్కువైంది. అయితే రజాకార్ మూవీని ఈనెల 14వ తేదీన రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. అయితే దీనిపై పోలీసులకు, ఇటు ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై చిత్ర బృందం ఈసీకి కలిసి వివరణ కూడా ఇచ్చింది. అయితే సినిమాను బ్యాన్ చేసే హక్కు తమకు లేదని, వాస్తవాలు చూపిస్తే అందులో తమకేం అభ్యంతరం లేదని అధికారులు స్పష్టంచేసినట్లు తెలిసింది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ నాటికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాదయాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక పార్టీకి కలిసొస్తే.. మరొక పార్టీకి నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి కూడా ఎన్నికలకు సినీ టచ్ ఇస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి ‘వ్యూహం’ పేరుతో ఆర్జీవీ రెండు భాగాలుగా సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి ప్రకంపనలకు దారితీస్తుందనేది చూడాలి. మరి పార్లమెంట్ ఎన్నికలకైనా చిత్ర బృందం ‘రజాకర్’ ను రిలీజ్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed