Income Tax Department: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 21.3 లక్షల కోట్లు

by S Gopi |
Income Tax Department: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 21.3 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.13 శాతం పెరిగి రూ. 21.3 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను విభాగం సోమవారం వెల్లడించింది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో మెరుగైన వృద్ధి కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 14.6 శాతం అధికంగా రూ. 10.4 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ. 9.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికి వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 17.5 శాతం వృద్ధితో రూ. 11.01 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేట్ పన్ను వసూళ్లు 7.1 శాతంతో రూ. 9.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఈక్విటీల క్రయవిక్రయాల ద్వారా వసూలు చేసే సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) 55.5 శాతం పెరిగి రూ. 53,095 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీల ద్వారా రూ.55,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. నిర్దేశించిన సమయానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.15 శాతం పెరిగి రూ. 25.9 లక్షల కోట్లు ఉండగా, రీఫండ్‌లు 32.5 శాతం పెరిగి రూ. 4.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Next Story

Most Viewed