దీపావళి తర్వాత జోరందుకోనున్న బీజేపీ ప్రచారం

by GSrikanth |
దీపావళి తర్వాత జోరందుకోనున్న బీజేపీ ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నామినేషన్ల ప్రక్రియ చివరి క్షణం వరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేపట్టిన బీజేపీ ప్రచారంలోనూ అదే తీరు కనబరుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ప్రచారంలో మాత్రం అనుకున్నంత స్పీడ్‌ను అందుకోలేకపోతోంది. ఈ నెల 3వ తేదీ తర్వాత ప్రచారంలో దూసుకువెళ్తామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా ముఖంగా గత నెలలో చెప్పారు. ప్రచారానికి ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్, హిమంతబిశ్వ శర్మ వస్తారని వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. కేంద్ర మంత్రులు వచ్చినా వారు ప్రచారాన్ని అనుకున్నంత ఉధృతంగా తీసుకెళ్లలేకపోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కమలం పార్టీ ప్రచారం హోరెత్తుతుందని నేతలు కూడా భావించారు. కానీ చివరి క్షణం వరకు అభ్యర్థుల జాబితాలో మార్పులు చేయడంతో పాటు బీ-ఫారం ఇవ్వడంలో జాప్యం చేయడంతో ప్రజల్లోకి ఎవరూ వెళ్లలేదు. బీ-ఫారం అందాకే వెళ్దామని భావించి సైలెంటయ్యారు. పలుచోట్ల ప్రచారం చేపట్టినా అడపదడపా సాగింది. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే దీపావళి సెలవులు రావడంతో బీజేపీ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని భావిస్తోంది. కానీ, పండుగ నాడు ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారనేది కూడా అనుమానమే. అయితే కిషన్ రెడ్డి మరోసారి దీపావళి తర్వాత ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేపడుతామని చెప్పడం గమనార్హం.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఈనెల 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. ప్రధాని మోడీ 25, 26, 27 తేదీల్లో వస్తారని శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అయితే ఇప్పటి వరకు యోగి, హిమంత తెలంగాణ పర్యటన తేదీలు ఖరారవ్వలేదు. దీపావళి తర్వాత ఉత్తరప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంతబిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని చెబుతున్నారు. మరి దీపావళి తర్వాత అయినా కమలం పార్టీ ప్రచారం మరో లెవల్ కు వెళ్తుందా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story