బీజేపీ ఎవరి అయ్య జాగీర్ కాదు.. ఈటల రాజేందర్‌పై సొంత నేత ఫైర్

by GSrikanth |
బీజేపీ ఎవరి అయ్య జాగీర్ కాదు.. ఈటల రాజేందర్‌పై సొంత నేత ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీని హోల్ సేల్‌గా అమ్మాలని చూస్తున్నారని నర్సాపూర్ అసమ్మతి నేత గోపి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన తన అనుచరులతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందని ఆయన విమర్శలు చేశారు. ఈటల రాజేందర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని టికెట్లను తన అనుచరులకు ఇస్తానని వాగ్ధానం చేశారని, అందులో భాగంగానే వారి అనుచరులకు టికెట్లు కేటాయించేలా మానిప్యులేట్ చేశారన్నారు. కష్టపడి పనిచేసిన బండి సంజయ్‌ని, ఆయన అనుచరులను పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడుతున్న బండి సంజయ్ లాంటి నేతలను, కార్యకర్తలను జాతీయ నాయకత్వమే కాపాడుకోవాలని ఆయన కోరారు.

జాతీయ నాయకత్వం ఎవరి ట్రాప్‌లో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 30, 40 మందిని చేర్చుకుంటామని ఝుటా మాటలు చెప్పిన వారిని హైకమాండ్ నమ్ముతోందని గోపి ఫైరయ్యారు. తమకు టికెట్లు ఎందుకు కేటాయించలేదో జాతీయ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీలో కొందరు కాంగ్రెస్‌కు ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని గోపి ఆరోపణలు చేశారు. ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసి బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించినప్పుడు ఈటలకు బీసీ నినాదం గుర్తుకురాలేదా? అని గోపి ప్రశ్నించారు. బీజేపీని బొంద పెట్టాలని ఆయన చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు డిసెంబర్ 3 తర్వాత బీజేపీలో కొనసాగుతారా? అని ఆయన సవాల్ విసిరారు.

కండువాలు మార్చడం తమకు కూడా రెండు నిమిషాల పని అని, కానీ ఇతరుల్లాగా తాము ఆ పని చేయబోమని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈటల పోటీ చేస్తున్నా.. అక్కడి అసంతృప్తి నేతలతో ఎందుకు చర్చించలేదని ఆయన ధ్వజమెత్తారు. పని చేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి దొంగలకు టికెట్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. నర్సాపూర్ టికెట్ ప్రకటించి పది రోజులు దాటినా కనీసం సెగ్మెంట్‌లో ప్రచారం మొదలుపెట్టలేదని, అడిగితే.. పైనుంచి అందాల్సినవి రాలేదని చెబుతున్నారు.. ఆ అందాల్సినవి ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎవరి అయ్య జాగీర్ కాదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed