డోంట్ వర్రీ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది!

by GSrikanth |
డోంట్ వర్రీ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రౌండ్ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నదని, సంపూర్ణ మెజార్టీతో పవర్‌లోకి రాబోతున్నదని ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. దాదాపు 70-80 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వెల్లడించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కూడా ఇదే విషయాన్ని వివరించినట్టు తెలిసింది. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయనతో భేటీ అయిన సునీల్.. తాజా సర్వే రిపోర్టులతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు, సిక్స్ గ్యారెంటీస్‌పై ప్రజలకు ఏర్పడిన నమ్మకం, దాని ప్రభావంతో గెలిచే నియోజకవర్గాల వివరాలను వివరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడం నిశ్చయం అనే నిర్ధారణకు వచ్చిన సిద్ధరామయ్య... ఒక్కో సెగ్మెంట్‌వారీగా విజయావకాశాలపై సునీల్ టీమ్ నుంచి ఆరా తీశారు. రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా, వార్ రూమ్ టీమ్ సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తర్వాత దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించే కార్యక్రమాలను చేపట్టాలని ఏఐసీసీ అబ్జర్వర్లు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను సిద్ధరామయ్య కోరారు. ఇక ‘టాస్క్ సెంటర్ ’అంటూ సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ పవర్‌లోకి వస్తున్నట్టు ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించగా, సిద్ధరామయ్య సైతం అంతే ధీమాను వ్యక్తం చేశారు.

సునీల్ నుంచి రోజువారీ నివేదికలు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయవకాశాలపై సునీల్ టీమ్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నది. గతంలో మంత్లీ, వీక్లీ సర్వేలు చేసిన టీమ్‌లు ఇప్పుడు రోజువారీ నివేదికలు ఇస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌లో వస్తున్న మార్పులు, అభ్యర్థుల ప్రచార ప్రభావం, ఆరు గ్యారెంటీలతో ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం, శ్రేణులు చేస్తున్న పబ్లిసిటీతో అనుకూలిస్తున్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్‌ వైపు వస్తున్న వివిధ సెక్షన్ల ప్రజల ఓటింగ్ తదితర వివరాలన్నింటినీ ఈ టీమ్‌లు సేకరిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గ్రాఫ్ పడిపోతుండడం, ఇంకా గట్టి పోటీ కొనసాగుతున్న సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలం పుంజుకునేలా క్యాండిడేట్లను అలర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను, నిర్దిష్టంగా లోకల్ సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నాయి. ప్రజల్లో అసంతృప్తిగా ఉన్న అంశాలను గుర్తించి వాటిని మరింతగా హైలెట్ చేయడం, ప్రత్యర్థి టార్గెట్‌గా విమర్శల ధాటిని పెంచడంపై అభ్యర్థులకు సూచనలు చేస్తున్నాయి. ప్రత్యర్థి టీమ్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌గా లేవనెత్తాల్సిన సంక్షేమ పథకాల ఫెయిల్యూర్, ప్రాజెక్టుల్లోని డొల్లతనం, ప్రజలకు యాక్సెస్‌లో లేకపోవడం తదితర కీలక పాయింట్లను అందజేస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉండడంతో కీలకమైన సమయాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి అనువైన ప్లానింగ్ జరుగుతున్నది. కాంగ్రెస్ వేవ్‌లో కేసీఆర్ కొట్టుకుపోవుడు ఖాయమని టీపీసీసీ స్టేట్ లీడర్ ఒకరు వ్యాఖ్యానించారు.

మరింత కష్టపడాలి

నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా మారడం, పార్టీలోని వివిధ స్థాయిల నుంచి సంపూర్ణ సహకారం అందడం, అసంతృప్తి చల్లారడం.. ఇవన్నీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్ పెరగడానికి కారణమయ్యాయని సునీల్ టీమ్ విశ్లేషణలో తేలింది. రాష్ట్ర నాయకులతో పాటు ఏఐసీసీ నేతలతో ఇటీవల ఈ అంశాలనే వివరించింది. పలు సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలియడంతో వారు ప్రచారంపై ఫోకస్ తగ్గించి ముందస్తు సంబురాల్లో మునిగిపోయిన విషయం పీసీసీ నేతల దగ్గరకు చేరింది. కీలకమైన సమయంలో ఈ ధోరణి మంచిది కాదని వారిని హెచ్చరిస్తూనే చివరి రోజుల్లో మరింత కష్టపడాలని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన వేవ్ ఉన్నదనే ఆత్మవిశ్వాసం మంచిదేగానీ.. అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదని సునీల్ టీమ్‌తో పాటు పీసీసీ నాయకత్వం అభ్యర్థులను అలర్టు చేశాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో వార్ వన్‌సైడ్‌గానే ఉన్నప్పటికీ దాదాపు 25 నుంచి 30 స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే తీరులో టఫ్ ఫైట్ ఉన్నదని, ఈ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవడం ఒక ఛాలెంజ్ అని హెచ్చరించింది. ప్రచారానికి మిగిలిన రెండు రోజులతో పాటు సైలెన్స్ పీరియడ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపైనా వారికి పీసీసీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. పోలింగ్ రోజు వరకూ అప్రమత్తంగా ఉండాలని అటు అభ్యర్థులకూ, ఇటు పీసీసీ లీడర్లకూ, నియోజకర్గాల ఇన్‌చార్జిలకు సునీల్ టీమ్ స్పష్టం చేసింది.

ప్రత్యర్థుల కదలికలపై నిఘా

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఆ పార్టీ అనుసరించే పద్ధతులపైనా సునీల్ టీమ్ కాంగ్రెస్ అభ్యర్థులకు అవగాహన కలిగించింది. విజయం కోసం ప్రజలను బీఆర్ఎస్ మభ్యపెట్టే చాన్స్ ఉన్నదని, సైలెన్స్ పీరియడ్‌లో సొంతంగా చేసుకునే పనులతో పాటు ప్రత్యర్థి కదలికలపై నిఘావేసి కౌంటర్ వ్యూహంపై ఫోకస్ పెట్టాలని సూచించింది. అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తూ గ్రౌండ్‌లో పార్టీ శ్రేణులను గైడ్ చేయాలని సూచించింది. సునీల్ టీమ్ గుర్తించిన టఫ్ సెగ్మెంట్లలోని అభ్యర్థులకు బెంగళూరు ఆఫీస్ నుంచి ఫోన్లు చేయిస్తున్నది. కీలకమైన స్థానాల్లో లోకల్‌గా ఉండే పార్టీ లీడర్లతో యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయించే వ్యూహాన్ని కొద్దిమంది టీమ్ సిద్ధం చేసింది. సైలెన్స్ పీరియడ్‌లో మైక్రో లెవల్ పోల్ మేనేజ్‌మెంట్ గురించి నొక్కిచెప్తున్నది. పీసీసీ నియమించుకున్న స్ట్రాటజిస్టు కుమ్మరి శ్రీకాంత్ బెంగుళూరులోని సునీల్ ఆఫీస్ నుంచి వచ్చే గైడెన్సు మేరకు మైక్రో మేనేజ్‌మెంట్ స్ట్రాటెజీని లీడ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న అనుకూల పరిస్థితిని మరింతగా ఇంప్రూవ్ చేసి గెలుపు ఖాయం అనే స్థితికి తీసుకొచ్చేలా వ్యూహాలకు సునీల్ టీమ్ పదునుపెట్టింది. అధికార పార్టీకి పోల్ మేనేజ్‌మెంట్‌లో ఉండే అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని దానికి దీటుగా కౌంటర్ స్ట్రాటెజీపై ఫోకస్ పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed