అసెంబ్లీలో కేటీఆర్, ఈటల ఆప్యాయంగా పలకరింపు

by GSrikanth |
అసెంబ్లీలో కేటీఆర్, ఈటల ఆప్యాయంగా పలకరింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆప్యాయంగా పలకరించుకున్నారు. సభా సమావేశాలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నది. దానికి పావుగంట ముందే సభ్యులు హాల్‌ లోపలికి చేరుకున్నారు. ఒక్కో సభ్యుడిని కలుస్తూ పలకరిస్తూ ఉన్న కేటీఆర్ ప్రతిపక్షం కూర్చునే ఎడమవైపు ఈటల రాజేందర్ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్ళారు. కేటీఆర్ రాగానే పైకి లేచిన ఈటల రాజేందర్ పరస్పరం పలకరించుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు వీరిద్దరి మధ్య మాటలు చోటుచేసుకున్నాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. గత సమావేశాల సందర్భంగా సైతం స్వయంగా ఈటల రాజేందర్ సీటు దగ్గరకు వెళ్ళిన కేటీఆర్ చాలా సేపు మాట్లాడారు.

చాలాకాలం పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్ కనీసం తలెత్తి కూడా చూడని పరిస్థితులు కొనసాగాయి. ఒక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లేని పరిస్థితులు ఉండేవి. కానీ గత సమావేశాల్లో అనూహ్యంగా కేటీఆర్, ఈటల పలకరించుకోవడం సర్వత్రా చర్చకు దారితీసింది. అదే సీన్ తాజా సమావేశాల్లోనూ రిపీట్ కావడం గమనార్హం. ఈటలకు ప్రాణహాని ఉందని స్వయంగా ఆయన భార్య జమున ఇటీవల కామెంట్ చేయడంతో భద్రత కల్పిస్తామంటూ కేటీఆర్ తనంతట తానుగా ముందుకొచ్చి సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ బంధం మరింత బలపడిందని, తాజా సమావేశాల్లో ఇద్దరూ కలిసి గతంకంటే ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనమని గులాభీ నేతలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

Next Story