'రాష్ట్రంలో సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతా'

by GSrikanth |   ( Updated:2022-11-28 16:01:15.0  )
రాష్ట్రంలో సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ ఫోరం పెట్టి సమాధానం చెప్పాలని, ఎనిమిదేండ్లలో ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. సమస్యలు లేవని ప్రూవ్ చేస్తే తాను ముక్కు నేలకు రాసి పాదయాత్రలు మానుకుని తిరిగి వెళ్లిపోతానని ఆమె వ్యాఖ్యానించారు. నర్సంపేటలో ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు లోటస్ పాండ్ లోని తన పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలోని అన్ని పార్టీలు రాజకీయాల్లో కాలయాపన చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యలు ఎత్తిచూపేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ దాడులకు తెగబడిందని ఫైరయ్యారు. తెలంగాణలో అసలు న్యాయం ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అసలు రాష్ట్రంలో తాము పాదయాత్ర ఎందుకు చేయకూడదో కేసీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేసి.. బస్సును తగులబెట్టినా పోలీసులు కనీసం వారిని అడ్డుకొలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు. తెలంలగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉన్నట్లుగా టీఆర్ఎస్ కు పోలీసులు పని చేస్తున్నారని ఎద్దేవాచేశారు. అనేక బెదిరింపులకు దాడులు చేసినా భయపడకుండా పాదయాత్ర చేస్తున్నానని, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం తప్పా? అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ అని తెలిపారు. తనను ఈడ్చుకుంటూ పోలీసులు వ్యాన్ లో పడేశారని మండిపడ్డారు. అసలు తాము చేసిన తప్పేంటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మొత్తం గుండాలుగా మారారని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ నేతలు ఏమైనా ఆఫ్గనిస్తాన్ తాలిబాన్లా అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గురించి ప్రశ్నిస్తే ఒక మహిళకు ఇచ్చే బహుమానం ఇదేనా అని ఆమె ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొంచెమైనా సిగ్గు ఉంటే ఇలాంటి దాడులు చేయించి ఉండేవారు కారని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేశారని, ఇప్పుడది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిందని ధ్వజమెత్తారు. పోలీసులు.. సీఎంకు జీతగాళ్ళలా మారారని చురకలంటించారు. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఆషామాషీనా అని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పోలీసులు తరలించే సమయంలో షర్మిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు ఆమెను లోటస్ పాండ్ కు తరలించగా పాదయాత్ర పున: ప్రారంభంపై షర్మిల ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Next Story